అస్సాంలో రాహుల్ యాత్ర అడ్డగింత.. తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం

by GSrikanth |
అస్సాంలో రాహుల్ యాత్ర అడ్డగింత.. తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ యాత్రను అస్సాంలో బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై టీకాంగ్రెస్ సీరియస్ అయింది. యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన చూసి బీజేపీ బెంబేలెత్తుతోందని అందుకే బీజేపీ గుండాలు దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. రాహుల్ గాంధీపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ మేరకు ఈ ఘటనను వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆర్గనైజేషన్ ఇంచార్జ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ న్యాయయాత్ర అస్సాంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నిన్న సోనిత్ పూ‌ర్‌లో యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ ఈరోజు సాయంత్రం 6 గంటలకు అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేయాలని టీకాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్ బషీర్ బాగ్ లోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.

ఈ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఈ ర్యాలీలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ప్రజాస్వామిక సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం అయ్యేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed