- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి.. ఎట్టకేలకు వీడిన సస్పెన్స్
ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. హాట్ సీట్ అయిన ఖమ్మం.. అభ్యర్థి ఎంపిక విషయంలో ఎంతో ఉత్కంఠను రేపి చివరకు సీనియర్ నాయకుడైన రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడైన రఘురామ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. అనేకానేక మలుపులు తిరిగిన ఈ వ్యవహారం చివరకు నామినేషన్లకు ఒక్కరోజు ముందుగా ప్రకటించడం విశేషం. - దిశ, ఖమ్మం బ్యురో
దిశ, ఖమ్మం బ్యురో: ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డిని పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడైన రఘురామ్ రెడ్డిని ఎంపిక చేసినట్లు ప్రకటించడంతో ఆశావహులు తీవ్ర నిరాశలో ఉండిపోయారు. రెండు రోజుల క్రితమే బెంగళూరులో ఖర్గే సమక్షంలో జరిగిన సమావేశంలో అభ్యర్థి ఎంపిక పూర్తయ్యిందని ట్రిపుల్ ఆర్ (రామసహాయం రఘురామ్ రెడ్డి) కు కన్ఫామ్ అయ్యిందని సోషల్ మీడియాలో వైరల్ అయినా.. పార్టీ అధిష్టానం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ ముందస్తుగానే రఘురామ్ రెడ్డి తరఫున మంగళ, బుధవారాల్లో పొంగులేటి అనుచరులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇతనితో పాటు పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు సైతం నామినేషన్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.
అనేకానేక మలుపులు తిరిగి..
ఖమ్మం పార్లమెంట్ హాట్ సీటు కావడం.. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు తప్పదనే నేపథ్యంలో జిల్లాకు చెందిన మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమ కుటుంబ సభ్యులకు ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేశారు. ఒకే సీటుపై ముగ్గురు మంత్రులు పట్టుబడుతుండటంతో పార్టీ అధిష్టానానికి అభ్యర్థి ఎంపిక కష్టతరమైంది. మంత్రుల కుటుంబ సభ్యులకు కేటాయించేది లేదన్న వాదన తెరమీదకు రావడంతో అభ్యర్థి ఎంపిక సహజంగానే ఆలస్యమవుతూ వచ్చింది.
మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు కొందరు లోకల్, మరికొందరు నాన్ లోకల్ వారి పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. స్థానికంగా రాయల నాగేశ్వరరావు, వీవీసీ రాజా, పోట్ల నాగేశ్వరరావు పేర్లు వినిపించగా.. నాన్ లోకల్ కు సంబంధించి మండవ వెంకటేశ్వరరావు, హన్మంతురావు పేర్లు వినిపించాయి. వీరితో పాటు ప్రియాంకాగాంధీ పేరు సైతం తెరమీదకు రావడంతో అందరూ పార్టీ ప్రకటించే అభ్యర్థి ఎవరన్న విషయమై తీవ్ర ఉత్కంఠ రేపింది. నామినేషన్ల స్వీకరణకు ఒక్కరోజే ఉండటంతో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం మంత్రుల అభిప్రాయాలు సేకరించి మధ్యే మార్గంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ప్రసాద్ రెడ్డికి నిరాశ..
అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లా వ్యాప్తంగా కీరోల్ పోషించిన మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పార్టీలో చేరిన నాటినుంచే ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించారు. ఈ విషయమై పార్టీ అధిష్టానంతో ముందుగానే చర్చించి, ఆమోదమూ తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే సోదరుడు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటనల్లో ఉన్నా.. అన్నీ తానై జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను సమన్వయ పరుస్తూ ముందుకు సాగారు. అభ్యర్థుల గెలుపులో కీలకపాత్ర పోషించారు. పాలేరు నియోజకవర్గంలో సర్వస్వం తానై పార్టీ శ్రేణులను ముందుకు నడిపించి శ్రీనివాస్ రెడ్డి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు. పార్లమెంట్ ఎన్నికల సమయం నాటికి మంత్రుల కుటుంబ సభ్యులు తెరమీదకు రావడం.. అందరూ గట్టిగానే పట్టుబట్టడంతో ఈ వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారి అభ్యర్థి ఎంపికకూ ఆలస్యమైంది. పలువురి పేర్లు తెరమీదకు వచ్చినా చివరకు అధిష్టానమే చొరవ చూపి రామసహాయం రఘురామ్ రెడ్డి ని ఎంపిక చేసిందని టాక్.
స్వస్థలం పాలేరు నియోజకవర్గమే..
రామసహాయం రాఘురామ్ రెడ్డి తల్లిదండ్రులు సురేందర్ రెడ్డి, జయమాల దంపతులది కూసుమంచి మండలం చేగొమ్మ. 1961 డిసెంబర్ 19న రఘురామ్ రెడ్డి హైదరాబాద్ లో జన్మించారు. నిజామ్ కళాశాలలో బీకామ్, అనంతరం పీజీ డిప్లొమా విద్యను అభ్యసించారు. వ్యాపార రీత్య హైదరాబాద్ లో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన సురేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, వరంగల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహారావులతో వీరి కుటుంబానికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. రఘురామ్ రెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు వినాయక్ రెడ్డి సినీ హీరో వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రితను వివాహం చేసుకోగా.. చిన్న కుమారుడు అర్జున్ రెడ్డి మంత్రి పొంగులేటి కుమార్తె సప్నిరెడ్డిని వివాహం చేసుకున్నారు.
బీఆర్ఎస్, బీజేపీకి ఊరట..
కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో అటు ఆ పార్టీ నాయకులు, శ్రేణులతో పాటు బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు సైతం ఉత్కంఠగా ఎదురుచూశారు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైతే ఎన్నికలు టఫ్ గా మారుతాయని భావించారు. పొంగులేటి ప్రసాద్ రెడ్డి కాకుండా అభ్యర్థి ఎవరైనా తామే గెలుస్తామన్న ధీమా ఎవరికివారే వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా ప్రసాద్ రెడ్డికి కాకుండా రాఘురామ్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేయడంతో ఇరు పార్టీల అభ్యర్థులు గెలుపోటములపై బేరీజు వేసుకుంటూ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. రఘురామ్ రెడ్డి సైతం పొంగులేటి టీంతో పాటు తన తండ్రి పార్టీకి, ప్రజలకు చేసిన సేవలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు.