పసుపు నీళ్లతో శుద్ధి!.. హంతకుడి రాకతో మైల పడింది.. బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
పసుపు నీళ్లతో శుద్ధి!.. హంతకుడి రాకతో మైల పడింది.. బల్మూరి వెంకట్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమరవీరుల చావుకి కారణమైన హంతకుడు ఈ ప్రాంతానికి రావడంతో మైల పడిందని, అందుకే పసుపునీళ్లతో శుద్ది చేశామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. రేవంత్ రెడ్డి సవాలును స్వీకరిస్తూ రాజీనామ లేఖను సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వచ్చి వెళ్లిన అనంతరం కాంగ్రెస్ నాయకులతో కలిసి బల్మూరి వెంకట్ అమరవీరుల స్థూపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు అమరవీరుల చావుకు కారణమైన హంతకుడని, ఉద్యమ సమయంలో నిరుద్యోగులు, యువతను పొట్టనపెట్టుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాంటి వ్యక్తి అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైల పడిందని అందుకే పసుపు నీళ్లతో శుద్ది చేసినట్లు తెలిపారు. 10 ఏళ్లుగా హరీష్ రావు‌కి, బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరులు గుర్తుకు రాలేదని, కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు అడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్‌లో కాకుండా రాజకీయం చేసేందుకు వాడుకున్నారని, శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన ఆయనకు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారని, హరీష్ రావు రాజీనామా లేఖ వృధా కానివ్వనని, ఆగస్టు 15 తర్వాత ఖచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. హరీష్ రావు కేవలం బీఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమేనని, ఆగస్ట్ 15 వ తేదీ లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో లేదో కేసీఆర్ గారు చెప్పాలని అడిగారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. దొంగల వచ్చి వెళ్ళడం కాదు. పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పాలని, ఎమ్మెల్సీ గా నేను మీకు సవాల్ విసురుతున్నా రండి! అని బల్మూరి వెంకట్ ఛాలెంజ్ చేశారు.



Next Story

Most Viewed