ప్రధాని, అదాని కలసి దేశాన్ని దోచుకుంటున్నారు : టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు ధర్నా

by M.Rajitha |
ప్రధాని, అదాని కలసి దేశాన్ని దోచుకుంటున్నారు : టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు ధర్నా
X

దిశ; తెలంగాణ బ్యూరో : అదాని అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పిలుపు మేరకు, సెబీ చైర్ పర్సన్ రాజీనామా, అదానిపై ఈడీ దృష్టి పెట్టాలని కోరుతూ గురువారం ఈడీ కార్యాలయం ముందు టీ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. గన్ పార్క్ నుంచి ఈడీ ఆఫీస్ వరకు కాంగ్రెస్ నేతలు ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మోడీ హయంలో అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. పార్లమెంట్లో తమ నాయకుడు రాహుల్ గాందీ, అదాని అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసినా, కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. అదానీ ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... అనేక ప్రాజెక్టులు అదానీ గ్రూప్ కి మోడీ కట్టబెట్టారన్నారు. పోర్టులు, విమానాశ్రయలు, అన్ని రకాల ఆదాయాలు వచ్చే ప్రాజెక్టులను మోడీ అదానికి అక్రమంగా అప్పగించారన్నారు. కృత్రిమంగా అదాని షేర్ల విలువను పెంచి బీజేపీ అక్రమాలకు పాల్పడుతుందన్నారు. అమెరికా సంస్థ హేండెన్ బర్గ్ అదాని, సెబీ చైర్ పర్సన్ చేసిన మోసాలను బహిర్గతం చేశారని గుర్తు చేశారు. పూర్తి స్థాయిలో ఈ కుంభకోణం మీద విచారణ జరగాలన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ... అదాని కుంభ‌కోణంలో సెబీ చైర్ పర్సన్ ను త‌ప్పించడంతో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అదాని అక్రమాలపై తాము ధర్నా చేస్తుంటే బీజేపీ మెప్పుకోసం రుణ మాఫీ పేరుతో బీఆర్ఎస్ డ్రామాలాడుతుంద‌ని ఆరోపించారు. అదాని తప్పిదాలపై ప్రశ్నిస్తే, కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అదానీ అవకతవకలపై చర్యలు చేపట్టాల్సిన సెబి పెద్దలే అతనితో చేతులు కలప‌డం కంచే చేను మేసిన‌ట్లుగా ఉంద‌న్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ నల్లధనం తెస్తానని, పేదల ఖాతాలో పదిహేను లక్షలు వేస్తానని కనీసం 15 పైసలు కూడా వేయలేదని విమర్శించారు. అదానీ మాత్రం ప్రపంచంలోనే ధనవంతులు జాబితాలోకి చేరిపోయాడన్నారు. ఇందుకు పీఎం మోడీ సంపూర్ణంగా సహకరిస్తున్నాడని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు నిచ్చారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సెబీ చైర్ పర్సన్ ను వెంటనే విధుల నుంచి తప్పించాలన్నారు. అదానీ ఆస్తులు అక్రమంగా పెంచడంపై న్యాయవిచారణ జరగాల్సిన అవసరం ఉన్నదన్నారు. అదాని వ్యవహారంపై జేపీసీతో విచారణ జరిపించాలన్నారు.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... మోడీ ప్రభుత్వం దొంగ చాటున అదాని గ్రూపును కాపాడుతుందన్నారు. సెబీ చైర్ పర్సన్ కుటుంబ సభ్యులకి అదాని గ్రూపులో వాటాలు ఉన్నాయని ఆరోపించారు.

Next Story

Most Viewed