పేపర్ లీకేజీలపై KCR సమాధానం చెప్పాల్సిందే: ప్రొ. కోదండరాం డిమాండ్

by Satheesh |
పేపర్ లీకేజీలపై KCR సమాధానం చెప్పాల్సిందే: ప్రొ. కోదండరాం డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వికారాబాద్ జిల్లా తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీక్ ఘటనపై టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులను శిక్షించి, ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించడం లేదని విమర్శించారు. లక్షల మంది రాసే టెన్త్ పేపర్ కూడా లీక్ అవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అసలు ఈ ప్రశ్నపత్రాలు ఎలా లీకవుతాయని, ప్రభుత్వం ఇంత అలసత్వంగా ఎందుకు ఉందని ప్రశ్నించారు.

ప్రభుత్వ పర్యవేక్షణ లేక పోవడం వల్లే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయని విమర్శించారు. పదో తరగతి పేపర్ లీక్ అనేది విద్యార్థులకు చాలా పెద్ద దెబ్బ అని, విద్యార్థులు ఆందోళనకు గురవుతారని వివరించారు. ఈ పేపర్ లీకేజీ కూడా ప్రభుత్వం వైఫల్యం వల్లే జరిగిందని, లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పూర్తి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్ని పేపర్లు లీక్ అవుతున్నా.. సీఎం కేసీఆర్ స్పందించడం లేదని నిలదీశారు. పేపర్ల లీకేజీలపై అన్ని పార్టీలు పోరాటాలకు సిద్దమవ్వాలని కోరారు. ఈ ఘటనలపై విద్యార్థులు నిరుత్సాహాపడొద్దని సూచించారు.

Advertisement

Next Story