సినిమాలో RRR.. కాంగ్రెస్‌లో డబుల్ ఆర్.. ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |
సినిమాలో RRR.. కాంగ్రెస్‌లో డబుల్ ఆర్.. ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : సినిమాలో ట్రిబుల్ ఆర్ ఉన్నట్లే, కాంగ్రెస్‌లో డబుల్ ఆర్ ఉన్నారని ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఆర్ ఆర్ అంటే రాహుల్, రేవంత్ అని వివరించారు. ఈ ఇద్దరూ ప్రజల కోసం తపించే లీడర్స్ అని, ఆ నేతలకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. శనివారం ఆమె వికారాబాద్ జిల్లాలోని తాండూరు, కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ...ఈ లోక్ సభ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ప్రజలు ఆలోచనతో ముందుకు వెళ్లాన్నారు. బీజేపీని నమ్మి మరోసారి మోసపోవద్దని పిలుపు నిచ్చారు.

పేద ప్రజలకు అండగా తమ కుటుంబం పనిచేస్తుందన్నారు. తెలంగాణ ప్రజలు చైతన్య వంతులని, అసెంబ్లీ ఎన్నికల్లో మద్ధతు ఇచ్చినట్లే, లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు సపోర్టుగా ఉండాలని కోరారు. తెలంగాణతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉన్నదని ప్రియాంక గుర్తు చేశారు. ఇందిరాగాంధీని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారన్నారు. ఆ తర్వాత సోనియమ్మపై అభిమానం చూపించారని ఆనందం వ్యక్తం చేశారు. ఆ ప్రేమ, అభిమానం తనకు కూడా తెలంగాణ ప్రజలకు నుంచి లభిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని మోదీ రాయలేదని, రద్దు చేస్తే ఊరుకునేది లేదన్నారు.

రాజ్యాంగమే పేదలకు ఎన్నో అవకాశాలు కల్పించిందని 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేది కూడా రాజ్యాంగం మాత్రమే అని ప్రియాంక గాంధీ అన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పవర్ లోకి రాగానే ఏటా మహిళలకు, నిరుద్యోగులకు లక్ష సాయం చేస్తామన్నారు. కనీస మద్ధతు ధరపై చట్టం చేస్తామన్నారు. చిన్న వ్యాపారులు, పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. బీజేపీ సృష్టించిన మత కల్లొలాలు, విద్వేషాలను అణిచి వేసి, ప్రేమ, అహింస కు మార్గం వేస్తామన్నారు. ప్రజలు అన్నదమ్ముల్లా ప్రశాంతంగా జీవించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పేద ప్రజల కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని, ఆయనకు అన్ని సమస్యల పట్ట అవగాహన ఉన్నదన్నారు.

ఆయన లక్ష్యం నెరవేరేందుకు ఎస్సీ, ఎస్టీ,బీసీలు మద్ధతుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. ఇక గడిచిన పదేళ్లలో బీజేపీ చేసింది ఏమీ లేదన్నారు. పేద రైతులకు రూ.50 వేలు, రూ.లక్ష రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద రైతులకు రుణమాఫీ చేసేందుకు బీజేపీ సర్కార్‌ అంగీకరించదన్నారు. అంబానీ, అదానీల లాంటి బడా వ్యాపారులకు మాత్రం బీజేపీ సర్కార్​ ఏకంగా రూ.16లక్షల కోట్లు రుణమాఫీ చేసిందని ఆరోపించారు. పైగా కాంగ్రెస్‌ ప్రారంభించిన ప్రాజెక్టులు, పథకాలపై మోదీ తన ఫొటోలు వేసుకున్నారని మండిపడ్డారన్నారు. ఇప్పుడు థర్డ్ టైమ్ గెలిస్తే రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేమీ లేవని విమర్శించారు. దేశ ప్రజలు చెప్పే సమస్యలు వినటానికి కాంగ్రెస్‌ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కాంగ్రెస్‌ నేతలు భావిస్తారని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో గ్యాస్‌ సిలిండర్ ధర రూ.1200 ఉన్నదని, కానీ కాంగ్రెస్​ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ.500కే ఇస్తున్నట్లు తెలిపారు. రైతులు, నిరుపేదలు, మహిళల కోసం బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయదని మండిపడ్డారు. బీజేపీ పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయన్నారు. కాంగ్రెస్‌పై బీజేపీ నేతలు ఎన్నో అబద్ధాలు ప్రచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ కొందరి ఆస్తులు గుంజుకుని మరో వర్గానికి ఇస్తుందని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. ధర్మం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed