బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తే సహించం : CPI

by Nagaya |   ( Updated:2022-12-11 16:33:07.0  )
బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తే సహించం : CPI
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగరేణి కార్మికులే కాకుండా, రాష్ట్ర ప్రజలు కూడా సింగరేణి బొగ్గు తమ హక్కుగా భావిస్తారని, ఎట్టి పరిస్థితుల్లోను సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తే సహించబోమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. సింగరేణి బొగ్గు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన బొగ్గని, మంచి డిమాండ్ కలిగి ఉన్నదన్నారు. కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటుపరం చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను తన కార్పొరేట్ బడా పారిశ్రామికవేత్తలకు అప్పనంగా కట్టబెడుతున్న క్రమంలోనే ఇప్పుడు సింగరేణిని కూడా వేలం వేయడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని దానిని సీపీఐ అడ్డుకుంటుందని పేర్కొన్నారు.

ప్రధాని మోడీ రామగుండం పర్యటనకు వచ్చినప్పుడు సింగరేణి బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు చేయమని చెప్పి, పార్లమెంట్‌లో మంత్రి ఒక ప్రశ్నకు జవాబుగా బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ధ్వంద వైఖరి మాని బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సింగరేణి బొగ్గు గనులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేస్తే ఉపేక్షించేది లేదని, సీపీఐ ఉద్యమ బాట పడుతుందని చాడ హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed