- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్నెట్ సహాయంతో ప్రిపేర్ అయ్యా.. 'దిశ' ఇంటర్వ్యూలో సివిల్స్ మూడవ ర్యాంకర్ ఉమా హారతి
దిశ ప్రతినిధి, నారాయణపేట: కొన్ని నెలల పాటు ఢిల్లీలో ఒక కోచింగ్ సెంటర్ లో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు కోచింగ్ తీసుకున్న.. అక్కడ ఉండి శిక్షణ పొందడం నాకు నచ్చలేదు.. నాన్న వృత్తి రీత్యా ఎక్కడికి బదిలీ అయితే అక్కడ ఉంటూ ఇంటర్నెట్ సహకారంతో స్వతహాగా నోట్స్ తయారు చేసుకుని పరీక్షలకు సిద్ధం అయ్యాను అని సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలలో జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె 'దిశ''తో ప్రత్యేకంగా మాట్లాడారు.
దిశ: మీ కుటుంబ నేపథ్యాన్ని గురించి చెప్పండి..
ఉమా హారతి: మాది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. నాన్న వెంకటేశ్వర్లు ప్రస్తుతం నారాయణపేట జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. అమ్మ శ్రీదేవి గృహిణి. నా సోదరుడు సాయి వికాస్ 2021లో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ లో జాతీయస్థాయిలో 12వ ర్యాంకు సాధించి శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే ఉద్యోగంలో చేరాడు.
దిశ: మీ విద్యాభ్యాసం ఎక్కడెక్కడ సాగింది..? ఐఏఎస్ కావాలన్నా ఆలోచన ఎప్పుడు వచ్చింది..?
ఉమా హారతి: నేను హైదరాబాద్ బిహెచ్ఇఎల్ లో ఉన్న భారతీయ విద్యా భవన్ లో చదివి 2010లో పదవ తరగతి పూర్తి చేశాను. అనంతరం నారాయణ కళాశాలలో ఎంపీసీ చదివి 965 మార్కులు సాధించాను. హైదరాబాద్ లోనే ఐఐటి (సివిల్ ఇంజనీరింగ్) చదివాను. హైస్కూల్ దశలోనే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా ఉండేది. విషయం అమ్మ నాన్నకు చెప్పాను. వారి ప్రోత్సాహంతోనే లక్ష్యాన్ని సాధించగలిగాను.
దిశ: ఐఏఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకున్నారా..?
ఉమా హారతి: మొదట్లో ఢిల్లీలో ఓ ఇన్ స్టిట్యూషన్ లో శిక్షణ తీసుకున్న.. అక్కడ కొన్ని నెలలే ఉన్నా.. ఇంటికి వచ్చి అమ్మ నాన్న ఎక్కడ ఉంటే అక్కడే ఉంటూ ప్రిపేర్ అయ్యాను. ఇంటర్నెట్ సహకారంతో నోట్స్ తయారు చేసుకున్న.. గతంలో ఐఏఎస్ గా ఎంపికైన స్నేహితుల సలహాలు, సూచనలు, అమ్మానాన్నల ప్రోత్సాహంతో లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించాను.
దిశ: పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు.. ఎన్నోసారి మీ లక్ష్యాన్ని చేరుకోగలిగారు..?
ఉమా హారతి: ఏ లక్ష్యాన్ని ఎంచుకొని దాని సాధన కోసం అడుగులు వేస్తున్న కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి.. కొన్ని కొన్ని సార్లు ఫెయిల్యూర్ అవుతుంటాం.. అంతమాత్రాన నిరాశ నిస్పృహలకు గురి కావలసిన అవసరం లేదు. రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నిస్తే తప్పనిసరిగా ఫలితం ఉంటుంది. నాలుగు సార్లు పరీక్షలకు హాజరయ్యా.. కానీ ఎంపిక కాలేదు. ఐదవ ప్రయత్నంలో సక్సెస్ అయ్యా ను.
దిశ: సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలలో మీకు జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు వస్తుందని అనుకున్నారా..?
ఉమా హారతి: ఈసారి తప్పనిసరిగా మంచి ర్యాంకు వస్తుందని అనుకున్న.. కానీ మూడవ ర్యాంకు వస్తుందని ఊహించలేదు.. ఇన్నాళ్ల నా శ్రమకు.. మా తల్లిదండ్రుల ప్రోత్సాహానికి గుర్తింపు ఈ ఫలితం.
దిశ: పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు మీరు ఏం చేసేవారు..?
ఉమా హారతి: ప్రిపేర్ అయ్యే సమయంలో.. అదేపనిగా చదివే దానిని కాదు.. క్రమం తప్పకుండా యోగా, వాకింగ్ చేయడంతో పాటు బ్యాడ్మింటన్ కూడా ఆడుతాను.. కొన్ని సమయాలలో ఇష్టమైన సినిమాలు చూస్తూ రిలాక్స్ అయ్యే దానిని.
దిశ: ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు.. శిక్షణ పూర్తయిన తర్వాత ప్రజలకు ప్రభుత్వపరమైన అంశాలే కాకుండా స్వతహాగా ఏ విధమైన సేవలు అందించాలి అనుకుంటున్నారు..?
ఉమా హారతి: శిక్షణ పూర్తి చేసుకుని విధులలో చేరిన తర్వాత అప్పటి పరిస్థితులలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తా.. పరిస్థితులను బట్టి తప్పనిసరిగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి ఉన్నతాధికారుల సహకారంతో అమలు చేసి ప్రజలకు మేలు చేస్తా.
దిశ: యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏమిటి..?
ఉమా హారతి: యువత లక్ష్యాలను పెంచుకోవాలి.. ఆ లక్ష్యాల సాధన కోసం నిరంతరం శ్రమించాలి.. కొన్ని కొన్ని సార్లు ఆటంకాలు ఎదురవుతుంటాయి.. మరికొన్నిసార్లు లక్ష్య సాధనలో విఫలం అవుతుంటాం.. అంతమాత్రాన నిరాశ చెందకూడదు.. సమయాన్ని వృధా చేయకూడదు.. పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటూ లక్ష్య సాధన వైపు కసిగా అడుగులు వేయాలి.