CM Revanth Reddy: హైదరాబాద్ నగర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్

by Prasad Jukanti |
CM Revanth Reddy:  హైదరాబాద్  నగర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : పెరుగుతున్న జనాభా నేపథ్యంలో రాబోయే 25 ఏండ్ల భవిష్యత్తు అవసరాలను అంచనా వేసుకుని, గ్రేటర్ హైదరాబాద్ సిటీలో మంచినీటి సరఫరాకు సరిపడే మౌలిక సదుపాయాల ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) జలమండలి అధికారులను ఆదేశించారు. సిటీ ప్రజలకు సమర్థవంతంగా మంచినీటి సరఫరా చేసే ప్రణాళికలు ఉండాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇవాళ హైదరాబాద్ జలమండలి బోర్డు (Jalmandali Board Meeting) సమావేశం జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోర్డు సమావేశం కావడం ఇదే తొలిసారి. సమావేశంలో సిటీ విస్తరణను దృష్టిలో పెట్టుకొని 2050 నాటి అవసరాలకు సరిపడేలా ఫ్యూచర్ ప్లాన్ ఉండాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ తాగునీటితో పాటు సీవరేజీ ప్లాన్‌ను రూపొందించాలని, అవసరమైతే ఏజెన్సీలు, కన్సల్టెన్సీలతో అధ్యయనం చేయించాలని సూచించారు.

మంజీరా పాత లైన్ వెంబడి కొత్త ప్రాజెక్టు..

జలమండలి ఆదాయ వ్యయాలు ఆశాజనకంగా లేవని, వీటిని అధిగమించేందుకు ఆర్థిక శాఖ సమన్వయంతో తక్షణ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సంస్థ సొంత ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలన్నారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవాలని, తక్కువ వడ్డీతో రుణాలు తెచ్చుకునే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలన్నారు. అందుకు వీలుగా ప్రాజెక్టు డీపీఆర్లు తయారు చేయించాలని చెప్పారు. మంజీరా నుంచి (Manjira Pipe Line) సిటీలోకి నీటి సరఫరా చేస్తున్న మార్గాల్లో పాత లైన్ వెంబడి ప్రత్యామ్నాయంగా మరో అధునాతన లైన్ నిర్మించేలా ప్రాజెక్టు చేపట్టాలని.. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల జీవన్ మిషన్ ద్వారా నిధులు తెచ్చుకునేందుకు వీలుగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలని సీఎం ఆదేశించారు.

మల్లన్నసాగర్ నుంచే సిటీకి నీరు..

హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నిర్దేశించిన గోదావరి ఫేజ్-2 ప్రాజెక్టుకు మల్లన్నసాగర్ (Mallanna Sagar) నుంచి నీటిని తీసుకోవాలా, కొండపోచమ్మ సాగర్‌ను నీటి వనరుగా ఎంచుకోవాలా.. అనే అంశంపై సమావేశంలో చర్చించారు. కన్సల్టెన్సీ ఏజెన్సీలు ఇచ్చిన రిపోర్టుతోపాటు నీటి లభ్యత ఎక్కువగా ఉండటం, లిఫ్టింగ్ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని మల్లన్నసాగర్ నుంచే ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలో ప్రతిపాదించిన 15 టీఎంసీలకు బదులు, సిటీ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీల నీటిని తెచ్చుకునేలా మార్పులకు ఆమోదం తెలిపారు. అలాగే గోదావరి ఫేజ్ -2 ద్వారా మరింత నీటిని తెచ్చుకొని ఉస్మాన్‌సాగ‌ర్ , హిమాయత్ సాగర్ వరకు తాగునీటి సరఫరాకు డిజైన్ చేసిన ప్రాజెక్టుపై సమావేశంలో చర్చ జరిగింది.

Advertisement

Next Story