ఇండ్ల నిర్మాణ పథకం మార్గదర్శకాలు సిద్ధం.. తొలి ప్రాధాన్యత వారికే..?

by Nagaya |   ( Updated:2022-09-02 04:42:35.0  )
ఇండ్ల నిర్మాణ పథకం మార్గదర్శకాలు సిద్ధం.. తొలి ప్రాధాన్యత వారికే..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది నుంచి ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంపై ప్రాథమికంగా మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి. గృహ నిర్మాణ సంస్థ, రెవెన్యూ అధికారులు కలిసి వీటిపై విధివిధానాలు రూపొందించారు. కానీ, వీటితో అర్హుల ఎంపిక కీలకంగా మారుతోంది. అర్హులకు మాత్రమే ఈ స్కీం అందే చాన్స్​ ఉంది. దీంతో గ్రామస్థాయిలోని టీఆర్ఎస్​కార్యకర్తలకు ఈ పథకం వర్తించడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ఫైల్‌ను పక్కన పెట్టారు. కొన్ని కీలక మార్పులు చేసిన తర్వాతే అప్రూవ్​చేయాలని భావిస్తున్నారు. కొన్ని నిబంధనలను మార్చాలని అధికారులకు సూచించారు.

త్వరలో విధివిధానాలు

సొంత స్థలం ఉండి ఇళ్లు కట్టుకోవాలనుకునే నిరుపేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారు కానున్నాయి. ప్రాథమికంగా దీనికి సంబంధించిన నిబంధనలను హౌసింగ్ అధికారులు రూపొందించగా ప్రస్తుతం వీటిలో కొన్నిమార్పులు, చేర్పులను చేయాలని సీఎం చెప్పడంతో తుది నివేదిక ఆలస్యమవుతోంది. వీటిని దసరాకు ప్రకటించి, ఆ తర్వాత లబ్ధిదారుల ఎంపికను చేపట్టనున్నారు. ఈ పథకంలోని ఎంపిక బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించనున్నారు. అధికారులు తయారు చేసిన నిబంధనల ప్రకారం ఈ పథకం కింద మొత్తం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని, గరిష్టంగా రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించాలని అధికారులు ప్రభుత్వానికి పంపించిన రిపోర్టులో సూచించారు. డబుల్​బెడ్​ రూం ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా దీనిలో చాన్స్​ ఇవ్వనున్నారు. డబుల్​బెడ్​రూం కోసం దరఖాస్తులు చేసుకుని, వారిని ఇల్లు రాకుంటే వారికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. ఇక యధాతథంగానే ఈ గృహ నిర్మాణ పథకంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీలు, పేదలు, వారి స్థితిగతులను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిబంధనల్లో నిర్ణయించారు.

ఇక, సొంత స్థలం కలిగి ఉండి దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలని, సామాజిక, ఆర్థిక సర్వే- 2011 ప్రకారం ఇళ్లు లేని వారు సొంత ఇల్లు లేనట్టుగా నమోదు కావాలని, సొంత స్థలం, ప్రభుత్వం మంజూరు చేసిందా అనే పూర్వ వివరాలు ఆన్‌లైన్‌లో పక్కాగా ఉండాలని, గతంలో ప్రభుత్వం నుంచి ఏ గృహ నిర్మాణానికి లబ్ధిదారులై ఉండరాదని మార్గదర్శకాలను తయారు చేశారు. కచ్చితంగా గ్రామసభల్లో లబ్ధిదారుల ఎంపికను ప్రకటించాలని, అభ్యంతరాలు వస్తే దానిపై మండల స్థాయి అధికారితో విచారణ చేపించాలని, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 75 గజాలు, పట్టణ ప్రాంతాల్లో 50 గజాల నుంచి 75 గజాల మధ్య జాగా ఉండాలని, కింద ఒక గది, పైన మరో గది నిర్మించుకునేందుకు అనుమతించే పక్షంలో కనీస స్థలం 35 గజాలకు కూడా ఒకే చేయాలని అధికారులు నివేదిక తయారు చేశారు.

సెగ్మెంట్‌కు వెయ్యి

ఈ దసరాకు పూర్తి విధివిధానాలను ఖరారు చేసి, పథకాన్ని ప్రారంభించిన తర్వాత అర్హుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ముందుగా ప్రతి సెగ్మెంట్‌కు వెయ్యి చొప్పున ఇండ్లను ఇవ్వాలని భావిస్తోంది. ఇదివరకు ప్రతి సెగ్మెంట్‌కు 3 వేల ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

సొంతంగానే..!

ప్రతి నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేసేందుకు సర్కారు దగ్గర ఆర్థిక ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అందుకే వెయ్యికి తగ్గిస్తున్నారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఏవై అర్బన్​ కింద వచ్చే నిధులతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కొంత కలిపి ఇంటి నిర్మాణ పథకాన్ని ప్రకటించారు. దీనికోసం 1.69 లక్షల పీఎంఏవై అర్బన్​పథకంలో ఇండ్లను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. కానీ, పాత కథ ముందు పడింది. గతంలో ఇచ్చిన ఇండ్లకు యూసీలు, లబ్ధిదారులు జాబితా ఇవ్వలేదని కేంద్రం రాష్ట్రానికి నిధులు ఆపేసింది. 1.69 లక్షల ఇండ్లకు ముందుగా లబ్ధిదారుల జాబితా ఇస్తేనే మంజూరు ఇస్తామని స్పష్టం చేసింది. కానీ, రాష్ట్రం దగ్గర జాబితా లేకపోవడంతో ఈ పథకం రాదని తేలిపోయింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. అందుకే నియోజకవర్గానికి ముందుగా వెయ్యి మాత్రమే పరిమితం చేస్తున్నారు.

తొలి ప్రాధాన్యత ఎవరికి..?

ప్రభుత్వం ముందు కొత్త సమస్య వచ్చింది. ప్రస్తుతం హౌసింగ్​, రెవెన్యూ అధికారులు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటోంది. కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో తమ పార్టీ కార్యకర్తలకు కచ్చితంగా ప్రయార్టీ ఇస్తామని సీఎం కేసీఆర్​నుంచి మొదలుకుని ఎమ్మెల్యే వరకు చెప్తూనే ఉన్నారు. కానీ, ఇప్పుడిచ్చిన నిబంధనల ప్రకారం పార్టీ కార్యకర్తలకు వచ్చే చాన్స్​ ఉండదు. అందుకే కొన్ని మార్పులకు సీఎం కేసీఆర్​ సూచనలు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. గులాబీ నేతలకు అనుకూలంగా ఉండే నిబంధనలను సిద్ధం చేస్తున్నారు.

వచ్చే ఏడాది నుంచే బిల్స్​

ఈ దసరా వరకు మార్గదర్శకాలు సిద్ధం చేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, ఇండ్ల నిర్మాణాలు మాత్రం వచ్చే ఏడాది వరకు మొదలుకానున్నాయి. అంతేకాకుండా పునాదులు దాటి, స్లాబ్​లెవల్‌కు వచ్చిన తర్వాతే తొలి బిల్లు ఇవ్వాలని అధికారులు నిబంధనల్లో పెట్టారు. ముందుగా రూపాయి ఇచ్చేది లేద్దని, గతంలో ఆ విధంగా ఇస్తే అక్రమాలు జరిగినట్లు నివేదించారు. దీంతో వచ్చే ఏడాదిలోనే బిల్లుల చెల్లింపు ప్రక్రియ మొదలుకానుంది. రూ.3 లక్షల్లో రూ. 25 వేల వరకు ప్రభుత్వం వివిధ రూపాల్లో తగ్గించనున్నట్లు సమాచారం.

Also Read : 'మేం ఫ్రీగా డబ్బులిస్తాం... ఇళ్లు కట్టుకోండి'

Advertisement

Next Story

Most Viewed