బదిలీలు, పోస్టింగుల్లో మహిళలకు ప్రాధాన్యం

by Mahesh |
బదిలీలు, పోస్టింగుల్లో మహిళలకు ప్రాధాన్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ శాఖలో బదిలీలు, పోస్టింగుల్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ రఘుమారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం కోసం మింట్ కాంపౌండ్ లో స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు.

ప్రస్తుతం సంస్థలో 11,260 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారని, వారిలో 1723 మంది మహిళా ఉద్యోగుల ఉన్నట్లు వెల్లడించారు. విభాగాల వారీగా చూసుకుంటే అకౌంట్స్ వింగ్ లో 33 శాతం, ఇంజనీరింగ్ విభాగంలో 22 శాతం, పీ అండ్ జీ వింగ్ లో 43 శాతం, జనరల్ సర్వీసెస్ లో 43 శాతం, ఓ అండ్ ఎం సర్వీసెస్ లో 3 శాతం మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

ఓ అండ్ ఎం వింగ్‌లో మహిళా సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారని, ఆ విభాగంలోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం జేఎల్ఎం పోస్టుల్లో సైతం మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉద్యోగినులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు, శ్రీనివాస్, పర్వతం, మదన్ మోహన్ రావు, స్వామి రెడ్డి, పవర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు, మహిళా సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ జ్యోతి రాణి, జనరల్ సెక్రటరీ తులసి నాగరాణి, సుధా మాధురి, సంగీత గుప్తా, సత్యమ్మ, మంగమ్మ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story