చేతివృత్తిదారులకు లబ్ధి చేకూర్చేందుకే.. ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ స్కీమ్: MP లక్ష్మణ్

by Satheesh |
చేతివృత్తిదారులకు లబ్ధి చేకూర్చేందుకే.. ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ స్కీమ్: MP లక్ష్మణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పెట్టుబడిదారుల వల్ల చేతివృత్తిదారులు భూములు కోల్పోయారని, వ్యవసాయానికి దూరమయ్యారని, దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులవృత్తిదారులు పెత్తందార్ల ఒత్తిళ్లకు లొంగి కుల వృత్తికే అంకితమయ్యారని ఆయన వెల్లడించారు. అందుకే వారికి లబ్ధి చేసేందుకే సెప్టెంబర్ 17వ తేదీన మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు.

దీనివల్ల దాదాపు 30 లక్షల విశ్వకర్మ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారులు, పెత్తందార్లకే పెద్దపీట వేసేలా గత పాలకుల ఆలోచన విధానాలు ఉండేవని ఆయన విమర్శించారు. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, ఇండస్ట్రిలైజేషన్ పోటీతత్వానికి తట్టుకోలేక, వృత్తులను వదుకోలేక.. లక్షల కుటుంబాలు చేతి వృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నారన్నారు. అందుకే ప్రధాని మోడీ కులవృత్తులవారి వృత్తి కౌశలాన్ని పెంపొందించేందుకు శిక్షణ, పరిశోధన, పరికరాల కల్పన, ఉత్పత్తుల నాణ్యత ప్రామాణికతకు మెరుగులు దిద్దడంతో పాటు ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.

రూ.13 వేల కోట్లతో విశ్వకర్మ స్కీమ్‌ను ప్రవేశపెట్టారని, 30 లక్షల కుటుంబాలకు లబ్ధి జరగనుందన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి విడుత కింద నాలుగున్నర లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. కొయ్య పరికరాలు, మట్టిపాత్రలు, గృహోపకరణాలు వంటి మనిషి జీవనయానానికి తోడ్పడే వారికి ట్రైనింగ్ ఇచ్చి పీఎం విశ్వకర్మ సర్టిఫికెట్స్ ‌జారీ చేసి గుర్తింపు కార్డులు ఇస్తారన్నారు.

ఈ స్కీమ్ ప్రారంభోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ప్రజలందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శిల్పకళావేదికలో జరిగే కార్యక్రమంలో కిషన్ రెడ్డి, తాను పాల్గొంటామని, వరంగల్‌లో కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ రతన్ పాల్గొంటారన్నారు. దేశ వ్యాప్తంగా 70 కేంద్రాల్లో, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 750 ప్రాంతాల్లో ‘ధన్యవాద్ మోదీజీ’ పేరుతో బైక్ ర్యాలీలు, క్షీరాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed