High Court : ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత జీవోపై హైకోర్టులో విచారణ వాయిదా

by Ramesh N |   ( Updated:2024-08-27 15:35:16.0  )
High Court : ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత జీవోపై హైకోర్టులో విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత జీవో విషయంపై హైకోర్టులో జరిగిన విచారణ వాయిదా పడింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్ల నోటిఫికేషన్‌తోపాటు జీవోని ఇటీవల వైద్య శాఖ విడుదల చేసింది. నీట్ ప్రవేశ పరీక్ష రాసే సమయానికి విద్యార్థి వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికుడిగా పరిగణించాలని ప్రభుత్వం జీవో తెచ్చింది. దీంతో వివాదం చెలరేగింది. ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. తదుపరి విచారణను హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

ప్రభుత్వం తెచ్చిన ఈ జీవో ఆర్టికల్ 14 కు విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. అహ్మదాబాద్ పరిధిలో ఇలాంటి జీవోనే విడుదల చేయడంతో అక్కడి హైకోర్టు కొట్టివేసిందని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. రాష్ట్రంలో పుట్టి పెరిగి పదో తరగతి వరకు ఇక్కడే చదివి, ఇంటర్ ఇతర రాష్ట్రాల్లో చదివినంత మాత్రాన నాన్ లోకల్ కింద పరిగణించడం నిబంధనలకు విరుద్ధమని న్యాయవాదులు కోర్టుకు వెల్లడిచారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిది వరకు ఓ విద్యార్థి ఇక్కడే చదివాడు. తన తండ్రికి బదిలీల ప్రక్రియలో భాగంగా మహారాష్ట్రలో పదో తరగతి మాత్రమే చదవాల్సి వచ్చిందని, తిరిగి ఇంటర్ ఇక్కడే చదివినా ప్రభుత్వ నిబంధనల దృష్ట్యా ఎంబీబీఎస్ సీటుకు నాన్ లోకల్‌గా పరిగణిస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.

Advertisement

Next Story