నల్లగొండ కలెక్టర్‌ హరి చందనపై వాట్సప్‌లో పోస్టింగ్స్.. సోషల్ మీడియాలో వైరల్

by Nagaya |   ( Updated:2024-03-20 15:01:43.0  )
నల్లగొండ కలెక్టర్‌ హరి చందనపై వాట్సప్‌లో పోస్టింగ్స్.. సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందనపై వాట్సప్‌లో పెట్టిన పోస్టింగ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. ఆమె వైఖరిని నిలదీస్తూ కాంట్రాక్టర్లు పోస్టింగ్స్ పెట్టారు. బిల్లులు చేయకపోతే మేమందరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. విశ్వాసనీయ సమాచారం ప్రకారం.. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో చిన్న కాంట్రాక్టర్లు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేశారు. ఆ సమయంలో బయట అప్పులు చేసి కొందరు, ఆస్తులు తనాఖా పెట్టి మరి కొందరు అభివృద్ధి పనులను పూర్తి చేశారు. ఇలా ఒక్కొక్కరు లక్ష రూపాయలు మొదలుకొని కోటి రూపాయల వరకు వర్క్స్ చేశారు. కానీ వారికి గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించలేదు. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఎక్కడి బిల్లులు అక్కడ ఆగిపోయాయి.

కొత్త గవర్నమెంట్ కొలువుదీరినా..

డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాంట్రాక్టర్లలో కొత్త ఆశలు చిగురించాయి. తనకు వెంటనే బిల్లులు వస్తాయని ఆశపడ్డారు. ఎంబీ రికార్డులతో కలెక్టరేట్‌కు వెళ్లిన వారికి చుక్కెదురైంది. ప్రతి ఫైల్‌ను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని, మ్యాన్‌వల్‌గా ఒక్క ఫైల్‌ను చూడనని కలెక్టర్ హరిచందన తిప్పిపంపినట్లు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. అయినా తాను ఎన్నికల బదిలీల్లో భాగంగా ఈ జిల్లాకు వచ్చానని, ఇక్కడ ఎలాంటి ఫైల్స్ క్లియర్ చేయబోనని కలెక్టర్ తమ బిల్లులు పెండింగ్‌లో పెట్టినట్టు చిన్న కాంట్రాక్టర్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు ఒక్క బిల్లు కూడా మంజూరు చేయకపోవడం ఈ విమర్శలకు బలాన్ని చేకూరుస్తోంది. మార్చిలో ఎన్నికల కోడ్ వస్తుందని తెలిసినా.. చెక్కులు ఇవ్వకుండా మూడు నెలలు కాలయాపన చేసినట్లు కాంట్రాక్టర్లు ఆరోపణలు చేస్తున్నారు.

వాట్సప్ పోస్టుల్లో ఏముందంటే..?

డిసెంబర్ నుంచి మార్చి వరకు కాంట్రాక్టర్లు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన ఏ ఒక్క చెక్ రిలీజ్ కాలేదు. కలెక్టర్ చుట్టు ఎన్నిసార్లు తిరిగినా ఆమె పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. తాజా మళ్లీ ఎలక్షన్స్ రావడం.. మరో మూడు నెలల వరకు కోడ్ అమల్లో ఉంటుండటంతో చోటా కాంట్రాక్టర్లలో ఆగ్రహం పెరిగిపోయింది. ఈ క్రమంలో కలెక్టర్ తీరును నిరసిస్తూ వాట్సప్‌లో పోస్టులు పెట్టారు. ‘ మూడు నెలల నుంచి చెక్కులు రాక ఇబ్బందులు పడుతున్నాము. మా పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. ఎన్నికల పేరుతో మరో రెండు నెలలు మీరు చెక్కులు జారీ చేయకపోయినట్లయితే మేము అందరం రోడ్లపై పడే పరిస్థితి ఉన్నది. మరియు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాపురించింది. దయచేసి ఎన్నికల కోడ్‌తో సంబంధం లేకుండా మా చెక్కులు రిలీజ్ చేయగలరు. ఇట్లు నల్లగొండ జిల్లా చిన్న కాంట్రాక్టర్ల తరుఫున విన్నపం’ అని పోస్టులు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు వాట్సప్‌లో వైరల్‌గా మారాయి.

సీఎం రేవంత్ రెడ్డికి మెస్సేజ్‌లు ఫార్వర్డ్

నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన తీరుపై జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. మూడు నెలలుగా తమకు రావాల్సిన బిల్లులు ఆపేసి మమ్ముల్ని రోడ్డున పడేశారని ఏకంగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ‘ఇది నల్లగొండ జిల్లా కలెక్టర్ తీరు’ అంటూచ పూర్తి వివరాలతో సీఎం వాట్సప్‌కు మెసేజ్‌లు చేశారు. అలాగే తమ బాధను వివరిస్తూ నల్లగొండ కలెక్టర్‌ హరిచందనకూ నేరుగా మెస్సేజ్‌లు చేశారు. చిన్న కాంట్రాక్టర్లపై దయచూపి బిల్లులు చెల్లించాలని అభ్యర్థించారు.

అయితే వీటిపై అటు సీఎం, ఇటు కలెక్టర్ నుంచి ఎలాంటి రిప్లైలు రాకపోయినప్పటికీ.. ఇదే ఇష్యూపై కలెక్టర్ దగ్గరకు వెళ్లిన సీపీఓకు మాత్రం కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించి రికార్డులను మ్యాన్‌వల్‌గా తీసుకురావాలని ఆదేశించినట్లు సమాచారం. సీఎంవో నుంచి ఫోన్ రావడంతోనే కలెక్టర్ ఆగమేఘాల మీద ఫైల్స్ అడిగినట్లు తెలుస్తోంది. గతంలో ఆన్‌లైన్‌లోనే ఫైళ్లు సమర్పించాలని కోరిన కలెక్టర్.. తాజాగా మ్యాన్‌వల్‌గా తీసుకురావాలని చెప్పడంతో సీపీఓ అయోమయంలో పడినట్టు కలెక్టరేట్ వర్గాలు గుసగులాడుతున్నాయి.

Advertisement

Next Story