ఎన్నికల కోసం పొలిటికల్ గేమ్స్ వద్దు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్

by Prasad Jukanti |
ఎన్నికల కోసం పొలిటికల్ గేమ్స్ వద్దు.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు పొన్నం కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ అభివృద్ధి విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలు చూస్తే ఆశ్చర్యంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హైదరాబాద్ నగరం నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా సిటీ డెవలప్మెంట్ కోసం గడిచిన 5 ఏళ్లలో కేంద్రం నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చారా? అని ప్రశ్నించారు. గురువారం టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి గాంధీ భవన్ లో పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పరిపాలనలో జీహెచ్ఎంసీ, జలమండలిలో నిధుల లేమితో హైదరాబాద్ నగరం అనాథలా మారిందంటూ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. గడిచిన 10 ఏళ్ల బీజేపీ హయాంలో నగర అభివృద్ధి కోసం నిధులు తేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో అంటకాగి హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసింది మీరు కాదా అని ఎటాక్ చేశారు. హైదరాబాద్ ఇమేజ్ కు భంగం కలిగే విధంగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. హైదరాబాద్ కు బీజేపీ, బీఆర్ఎస్ చేసిందేంటో చెప్పాలన్నారు. బీజేపీపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక నిధులు తీసుకురావడంలో బీఆర్ఎస్ విఫలం అయిందన్నారు. భూకబ్జాలు, అక్రమ కట్టడాలుతో హైదారాబాద్ ఇలా కావడానికి బీఆర్ఎస్, బీజేపీలే కారణం అని,. మేము అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి నిధుల కోసం అనేక విజ్ఞప్తులు చేశామన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయని రాజకీయ ఆటలో భాగంగా హైదరాబాద్ ను విమర్శించడం సరికాదన్నారు. హైదరాబాద్ ను తమ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినట్టు, అభివృద్ధి కుంటూ పడినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

బోనాల పండగ తర్వాత బస్తీ బాట:

బోనాల పండుగ పూర్తయిన తర్వాత బస్తీల్లోకి వెళ్లి నేరుగా సమస్యలు పరిష్కరిస్తామని పొన్నం చెప్పారు. నగరంలో ఉన్న 150 డివిజన్ లలో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. హైదరాబాద్ హిస్టారికల్ సిటీ అని, ఈ నగర బ్రాండ్ ఇమేజ్ ను కాపాడేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి అన్నారు. చార్మినార్, గోల్కొండ లాంటి ఆర్కియాలజీకి సంబంధించినవి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని. వీటి కోసం కిషన్ రెడ్డి ప్రత్యేకంగా ఎలాటి నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు. స్థానిక సంస్థలకు 73, 74 రాజ్యాంగం ద్వారా వచ్చే 15వ ఫైనాన్స్ నిధులు తప్ప అదనంగా ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి హైదరాబాద్ స్మార్ట్ సిటీ చేయలేదు, అమృత్ పథకం నుంచి ఒక్క రూపాయి తేలేదు. హైదరాబాద్ అభివృద్ధి కోసం కిషన్ రెడ్డి చేసిందేమైనా ఉంటే చెప్పాలన్నారు. మీరు కేంద్ర మంత్రి అయ్యాక హైదరాబాద్ ఇంచార్జి మంత్రిగా తాను గౌరవంగా మిమ్మల్ని కలవడానికి వచ్చి హైదారాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరానని గుర్తు చేశారు. రాజకీయంగా లబ్ధి పొందడానికి తప్ప మీరు ఈ నగరానికి చేసిందేమి లేదని చేతనైతే హైదరాబాద్ అభివృద్ధికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ఇంచార్జి మంత్రిగా ఇక్కడి సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నగరంలోని 151 ప్రాంతాల్లో వర్షం నీటిని స్థానికంగా ఉండే ప్రభుత్వ స్థలాల్లో అండర్ గ్రౌండ్ లోకి వెళ్లే విధంగా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ లాంటి హాస్పిటల్ లు మరింత సేవ చేసే విధంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు వారి ఉచ్చులో పడొద్దు:

ఎన్నికల కోడ్ కారణంగా పోటీ పరీక్షల నిర్వహణలో జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైందని ప్రశ్నించిన వీళ్లే ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తామంటే అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులు ప్రతిపక్షాల ఉచ్చులో పడవద్దని కోరారు. నిజమైన సమస్య ఉంటే విద్యార్థి సంఘాల నాయకులు మా దృష్టికి తీసుకురావాలన్నారు. 10 సంవత్సరాల్లో డీఎస్సీ, టెట్ నిర్వహించని వాళ్లు ఇవాళ విద్యార్థులను ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed