మళ్లీ అదే అస్త్రం ఉపయోగించబోతున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్‌, బీజేపీలకు చావు దెబ్బ తప్పదా?

by Gantepaka Srikanth |
మళ్లీ అదే అస్త్రం ఉపయోగించబోతున్న కాంగ్రెస్.. బీఆర్ఎస్‌, బీజేపీలకు చావు దెబ్బ తప్పదా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఢిల్లీ టూర్‌తో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతున్నది. ఈ నెల 11న కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. అమృత్ టెండర్ల గోల్ మాల్ అంశంపై కేంద్ర మంత్రికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీ(BJP) ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ వెళ్లారని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్(BRS) మధ్య స్నేహబంధం ఉందని చెప్పేందుకు ఈ ఇష్యూనే నిదర్శనమని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ సైతం ఈ అంశంపై అలర్ట్ అయింది. కేటీఆర్ కు అసలు అపాయింట్ మెంటే దొరకలేదని, కేంద్రమంత్రితో ఆయన కలిస్తే ఆధారాలు చూపెట్టాలని డిమాండ్ చేస్తున్నది.

ఆధారాలెక్కడ..

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుండడంతో కమలం పార్టీ అలర్ట్ అయింది. అసలు కేటీఆర్ కు కేంద్ర మంత్రి అపాయింట్ మెంటే దొరకలేదని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ‘ఎక్స్’ వేదికగా తెలిపారు. అలాగే ధర్మపురి అర్వింద్ సైతం కేంద్ర మంత్రిని కలిసిన ఫొటో చూపించాలని అడిగారు. కేటీఆర్ అబద్ధపు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిని కలిసినట్లుగా కేటీఆర్ చెప్పుకున్నంత మాత్రాన.. అదే నిజమవుతుందా? అని బీజేపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. అసలు కలిసినట్లు ప్రూఫ్ ఎక్కడ అని నిలదీస్తున్నాయి. కాగా, గతంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ చేసిన ఆరోపణల ఎఫెక్ట్ గులాబీ, కమలం పార్టీని ఇంకా వెంటాడుతున్నాయి. ఈనేపథ్యంలో వెంటనే దిద్దుబాటు చర్యలకు కమలం నేతలు దిగారు. త్వరలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో నష్టం జరిగే అవకాశముందని పార్టీ అలర్ట్ అయినట్లు తెలుస్తున్నది.

గతంలో రెండు పార్టీలకూ నష్టం

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని వచ్చిన ఆరోపణలు ఈ రెండు పార్టీలకు తీరని నష్టాన్ని కలిగించాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోతే.. అధికారంలోకి రావాలని చూసిన కమలం పార్టీ కేవలం 8 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. ‘దోస్తీ’ ఆరోపణలు ఇరు పార్టీలపై తీవ్ర ప్రభావం చూపాయి. అయితే గతంలో వచ్చిన ఈ ‘దోస్తీ’ ఆరోపణలు ఇప్పుడు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో ఇదే ఆరోపణలతో ఇరు పార్టీలను గట్టి దెబ్బ కొట్టిన హస్తం పార్టీ.. మళ్లీ అదే లైన్‌ను అందుకోవడం గమనార్హం.

Advertisement

Next Story