సీఎం చంద్రబాబుతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు

by Jakkula Mamatha |
సీఎం చంద్రబాబుతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో :ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్టీఆర్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు,బలహీన వర్గాల సంక్షేమం, సంస్కరణలు చేసిన పార్టీ టీడీపీ అన్నారు. హైదరాబాద్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ అని వెల్లడించారు. విభజన సమస్యలు పరిష్కరించుకుందాం అని చంద్రబాబు చొరవ తీసుకుని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం అభినందనీయం, దీనిపై కూడా ఏవేవో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాధినేతలు భోజనాలు చేసుకున్నారే గానీ విభజన సమస్యలు పట్టించుకోలేదు.. పరిష్కారం చేయలేదు అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల గురించి మాట్లాడే హక్కు కోల్పోయిందన్నారు. చర్చలతో సమస్యల పరిష్కారానికి బాబు కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న పరిపాలన నిర్ణయాలే తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్‌ కు ప్రధాన కారణం అన్నారు.

ఇకపై వచ్చే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని, బడుగు, బలహీన వర్గాలకు, యువతకు, మహిళలకు అందరికీ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కార్యకర్తలు, నాయకులు యాక్టివ్‌ కావాల్సిన అవసరమున్నదన్నారు. రాష్ట్ర కమిటీ అంతా సమిష్టిగా పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడ్తామని వెల్లడించారు. గ్రామస్థాయిలోకి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. జాతీయ స్థాయిలో బలమైన జాతీయ పార్టీగా ఉన్నారని వెల్లడించారు. తెలంగాణలోనూ ఎన్డీయే కూటమిగా ఏర్పడటానికి బాబు ఆదేశిస్తే మధ్యవర్తిగా కృషి చేస్తానని తెలిపారు. కూటమితో ఏపీలో అధికారంలోకి వచ్చిన మాదిరిగానే తెలంగాణ లోనూ రాబోయే కాలంలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి అధికారం కొత్తేమీ కాదని వెల్లడించారు. బాబుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ మర్యాదపూర్వకంగానే అన్నారు. భవన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కేడర్ కు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్‌ ఆరిఫ్‌, కార్యనిర్వాహక కార్యదర్శి సైదేశ్వర్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed