- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎవరా కొందరు? పొలిటికల్ టర్న్ తీసుకున్న చినజీయర్ కామెంట్స్
దిశ, తెలంగాణ బ్యూరో: మొన్నటిదాకా కేసీఆర్ సర్కారుకు పెద్ద దిక్కుగా భావించిన చిన్న జీయర్‌తో.. కేసీఆర్‌కు సంబంధాలు బెడిసికొట్టాయనే వార్తలు మరోసారి గుప్పుమన్నాయి. తాజాగా శుక్రవారం జీయర్ చేసిన వ్యాఖ్యలే ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చుతున్నాయి. ప్రగతిభవన్‌లో హోమం నుంచి మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం, యాదాద్రి ఆలయం పున:ప్రారంభం వరకు అన్నింటికీ ముహూర్తాలు పెట్టి, సలహాలు ఇచ్చే చినజీయర్‌కు యాదాద్రి ఆలయ ప్రారంభం ఆహ్వానం అందలేదని ఆయనే ఒప్పుకున్నారు. అంతేకాకుండా కొంతమంది తాను మాట్లాడిన వీడియోలను ఎడిటింగ్ చేసి, సొంతలాభం కోసం బయటకు విడుదల చేస్తున్నారంటూ చెప్పుకురావడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. అసలు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఆహ్వానం లేదు
యాదాద్రి ఆలయ పుననిర్మాణ పనులన్నీ ముందు నుంచీ చినజీయర్ సలహాలతోనే నడిచాయి. అంతేకాకుండా ఆలయ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేయాలని చినజీయర్ స్వామిని సీఎం కేసీఆర్ కోరారని, ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు యాదాద్రి ఆలయం ప్రారంభానికి చినజీయర్ స్వామి ముహూర్తం ఖరారు చేశారని గతంలో ప్రకటించారు. దీంతో స్వదస్తూరితో చినజీయర్ స్వామి ముహూర్త పత్రిక రాశారని, యాదాద్రి ఆలయంలో స్వామివారి పాదాల చెంత ముహూర్త పత్రికను ఉంచిన సీఎం కేసీఆర్ అనంతరం ఆలయ ప్రారంభానికి సంబంధించి తేదీపై ప్రకటన చేసిన విషయం విదితమే. కానీ, ఇప్పుడు యాదాద్రి ఆలయ ప్రారంభానికి చినజీయర్‌కు ఆహ్వానం అందలేదు. ఆలయ ప్రారంభ ప్రక్రియకు సంబంధించి విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేరును ప్రభుత్వం ఎక్కడా పేర్కొనలేదు. ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ పూజలు చేపట్టనున్నారు. దీనిపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విడుదల చేసిన ప్రకటనలో చినజీయర్ పెట్టిన ముహూర్తానికే పూజలు జరుగుతాయని చెప్పినా.. ఆయన ఆధ్వర్యంలో ఈ పూజలు నిర్వహిస్తారని ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం.
తాజాగా వివాదాల వీడియోలు
ముచ్చింతల్‌లో చినజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహ ఏర్పాటు కార్యక్రమం నుంచి కేసీఆర్‌తో జీయర్‌కు విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దానిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. ఇలాంటి సమయంలో చినజీయర్‌కు సంబంధించిన కొన్ని పాత వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలు గులాబీ సోషల్ మీడియా నుంచే వస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఏదో ప్రసంగం సందర్భంగా సమ్మక్క సారలమ్మపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పాత వీడియో వివాదాలు మారాయి. అంతేకాకుండా మాంసాహారం తినడంపై జీయర్ చేసిన వ్యాఖ్యలు, రాజకీయ నేతలను ఉద్దేశించి " గతంలో దొంగలకు గన్మెన్లు ఉండేవారు.. ఇప్పుడు రాజకీయ నేతలకు ఉంటున్నారు.. వారు వీరయ్యారా" అంటూ చేసిన ప్రసంగం వీడియోలతో పాటుగా శివుడికి రావణుడు పరమ ఇష్టం అంటూ చెప్పిన అంశాల వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
జీయర్ వ్యాఖ్యలతో రాజకీయ చర్చ
తాజాగా సమ్మక్క–సారలమ్మపై చేసిన వ్యాఖ్యలు, వెల్లువెత్తుతున్న విమర్శలపై చినజీయర్ విజయవాడ వేదికగా వివరణ ఇచ్చుకున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా తన పాత వీడియోలను ఎడిటింగ్ చేస్తున్నారంటూ, సొంత లాభం కోసమే ఇలా ఆయా సందర్భాల్లో మాట్లాడిన వాటిని ఎడిటింగ్ చేశారని చెప్పారు. దీంతో జీయర్ను ఇంతలా వివాదాల్లోకి లాగాల్సిన అవసరం ఎవరికి ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో యాదాద్రి ఆలయం ఆహ్వానం అందలేదని, పిలిస్తే వెళ్తా.. లేకుంటే చూసి ఆనందిస్తా అంటూ ప్రకటించారు. ప్రతి పనికి జీయర్ను ముందు పెట్టే ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు పిలువడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ లెక్కన జీయర్‌కు, కేసీఆర్‌కు మధ్య గ్యాప్ వచ్చిందంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుతున్నారు.