తాజా సమీకరణాలతో ప్లాన్ ఛేంజ్! సికింద్రాబాద్‌ బరిలో YS Sharmila..?

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-25 06:44:04.0  )
తాజా సమీకరణాలతో ప్లాన్ ఛేంజ్! సికింద్రాబాద్‌ బరిలో YS Sharmila..?
X

దిశ, డైనమిక్ బ్యూరో :

సికింద్రాబాద్ సెగ్మెంట్ నుంచి వైఎస్సార్టీటీ అధ్యక్షురాలు బరిలో దిగబోతున్నారా..? మొన్నటి వరకు పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె.. తాజా సమీకరణాలతో నిర్ణయాన్ని మార్చుకున్నారా..? వచ్చే ఎన్నికల్లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి అదే పార్టీ తరఫున పోటీ చేయనున్నారా..? వీటన్నింటికీ అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ‘నేను తెలంగాణ కోడలిని. ఇక్కడే పెరిగాను. ఇక్కడే పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే పిల్లల్ని కన్నాను. ఇకపైనా తెలంగాణలోనే ఉంటా. తెలంగాణతో నాకు విడదీయరాని అనుబంధమున్నది’ అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు.

ఏపీకి రావాలని అక్కడి నేతల ఫోర్స్

పాలేరు నుంచి పోటీ చేస్తానంటూ పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు. వైఎస్సార్ జయంతి రోజున అక్కడ వైఎస్సార్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. మొదట్లో ఆమె వైఎస్సార్టీపీ తరఫునే బరిలో ఉంటానని చెప్పుకొచ్చారు. కానీ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో వైఎస్సార్టీపీని విలీనం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఏఐసీసీ వర్గాలు కూడా సూచనప్రాయంగా సానుకూల సంకేతాలిచ్చాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ థాక్రేను ప్రశ్నించగా అది ఏఐసీసీ చూసే వ్యవహారమని బదులిచ్చారు. దివంగత వైఎస్సార్‌కు ‘ఆత్మ’గా ముద్రపడిన కేవీపీ రామచంద్రరావు ఢిల్లీలో ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. విలీనంపై చర్చలు జరుగతున్నది నిజమేనని, ఆశాజనక ఫలితాలే ఉంటాయని వ్యాఖ్యానించారు. విలీనంపై చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు పలువురు ఆమెను ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక్కడ వద్దంటున్న లోకల్ లీడర్స్..

తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతున్నదని భావిస్తున్న సమయంలో షర్మిల పార్టీ విలీనంపై ఇక్కడి నేతల నుంచి సానుకూలంగానే స్పందిస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం చేయడం సమంజసంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయితే నెగెటివ్ అవుతుందని అంటున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఫ్యాక్టర్‌తో చెడిపోయిన చేదు అనుభవాన్ని గుర్తుచేస్తున్నారు. వీరిలా అడ్డుకుంటుంటే.. షర్మిల మాత్రం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ద్వారా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆమె పాలేరు నుంచి లేదా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీచేసే అవకాశాలున్నాయి. ఏఐసీసీ నుంచి నిర్దిష్ట ఆదేశాలు వస్తే ఏదో ఒక సీటు ఆమెకు ఖరారయ్యే అవకాశాలున్నాయి.

Read more : disha newspaper

Advertisement

Next Story