ఫార్మాసిటీ..ఫోర్త్ సిటీలపై సీఎం దొంగమాటలు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-20 09:50:55.0  )
ఫార్మాసిటీ..ఫోర్త్ సిటీలపై సీఎం దొంగమాటలు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఫార్మా సిటీ..ఫోర్త్ సిటీలపై సీఎం రేవంత్ రెడ్డి అన్ని దొంగ మాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇబ్రహీం పట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో నిర్వహించిన దసరా సమ్మేళనం అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరై కేటీఆర్ మాట్లాడారు. బయట ఫార్మా సిటీ రద్దైందని చెబుతున్న రేవంత్ రెడ్డి కోర్టులో మాత్రం ఫార్మా సిటీ ఉందని అంటున్నారని, ఈ ప్రభుత్వం ఎంత దొంగ ప్రభుత్వమో వాళ్లు కోర్టుకు చెప్పిన మాటలను బట్టి అర్థం చేసుకోవాలన్నారు. చట్టం ప్రకారం ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములను వేరే దానికి వాడటానికి వీలు లేదని, అందుకే సీఎం రేవంత్ రెడ్డి కోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడని స్పష్టం చేశారు. ఫోర్త్ సిటీ కోసం నాలుగు ఇంచుల భూమిని కూడా సేకరించలేదని, మరి ఫార్మాసిటీ రద్దు చేస్తే...ఫోర్త్ సిటీ ఎలా నిర్మిస్తారని, అన్ని దొంగ మాటలేనని, నిన్ను వదిలిపెట్టం, అసెంబ్లీలో, కోర్టులో, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూనే ఉంటామని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టులో న్యాయం దొరకకపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని, గల్లీ, గల్లీ తిరిగి రేవంత్ రెడ్డి మోసాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మాసిటీ నిర్మించేందుకు కేసీఆర్ కృషి చేశారని, ఎనిమిదేళ్లు కష్టపడి రైతులను ఒప్పించి, మెప్పించి 14 వేల ఎకరాలు సేకరించామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కోమటి రెడ్డి, కోదండ రెడ్డి, సీతక్క, రేవంత్ రెడ్డి మీ భూములు గుంజుకుంటున్నారంటూ అప్పుడు తప్పుడు ప్రచారం చేశారని, మేము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇస్తామంటూ హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఫార్మా సిటీ రద్దు చేశామని చెప్పిన వారు మరి మీ భూములు మీకు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి, ఆయన నలుగురు బ్రదర్స్ కోసం, వాళ్ల రియల్ ఎస్టేట్ దందా కోసమే ఫోర్త్ సిటీ తెరపైకి తెచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా పూర్తిగా పడిపోయిందని, కట్టేదుంటే దమ్ముంటే ఫార్మా సిటీ కట్టు.. లేదంటే వాళ్ల భూమి వాళ్లకు ఇచ్చేయని కేటీఆర్ డిమాండ్ చేశారు. కానీ రియల్ ఎస్టేట్ దందా చేస్తా...నా వాళ్లకు భూములు కట్టబెడుతా అంటే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. ఫార్మాసిటీ రైతులు సహా ఈ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిన అంశాన్ని ప్రజలకు మనమే వివరించాలని, కాంగ్రెస్ మోసాలను ప్రజలకు వివరించేందుకు గ్రామ గ్రామాన మనమే కథానాయకులుగా మారాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కేసీఆర్ ముష్టి రూ. 10 వేలు రైతు బంధు ఇస్తున్నాడని, మేము అధికారంలోకి వస్తే రూ. 15 వేలు ఇస్తా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడని, ఇప్పుడు ఖరీఫ్ రైతు భరోసా ఎగగొడుతున్నామని సిగ్గు లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చావు కబురు చల్లగా చెప్పిండని కేటీఆర్ విమర్శించారు. కానీ రైతు సంఘాలు ఎందుకు మూగబోయాయని, కమ్యూనిస్టులు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. రైతు బంధును ఇచ్చే గొట్టే కుట్ర చేస్తున్న లంగలు వీళ్లు అని మండిపడ్డారు. అశోక్ నగర్ లో పిల్లలు ఆందోళన చేస్తున్నది సోషల్ మీడియాలో చూస్తున్నామని, మెయిన్ మీడియాలో చూపిస్తలేరని తప్పుబట్టారు. ఏడాది లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని, మరో రెండు నెలలు గడిస్తే ఏడాది అవుతదని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలుస్తదన్నారు. పిల్లలకు ఉద్యోగాల సంగతేమో కానీ...రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డికి మాత్రం ఉద్యోగాలు వచ్చాయన్నారు. రిజర్వేషన్ల విషయంలో కూడా వీళ్లు ఇచ్చిన జీవో 29 తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు.

చాక్ పీస్ లు, మందులకు, పోలీసుల బండ్లల్లో పెట్రోల్ కు పైసలు లేవంట..కానీ మూసీలో పోసేందుకు రూ. లక్షా 50 వేల కోట్లు ఉన్నాయటని, మూసీని అంత పైసలు పెట్టి ఎవరు చేయమని అడిగారని, రేవంత్ రెడ్డికి చిప్ దొబ్బినట్లు అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఎమన్నా అంటే నీ ఇళ్లు కూలగొడుతా అంటాడని, అంత ఊబలాటం ఉంటే...నా ఇళ్లు చట్టానికి వ్యతిరేకంగా ఉంటే నీ కళ్లు చల్లబడుతాయంటే కులగొట్టుకో.. కానీ పేదల ఇళ్ల జోలికి వెళ్లకని కేటీఆర్ అన్నారు. మూసీ ప్రక్షాళణ కోసం ఎస్టీపీలు కట్టామని, గోదావరి నీళ్లను అనుసంధానం చేసే పని మేమే చేశామని, ఇంకా ఏం అవసరముందని మూసీకి అన్ని పైసలు ఖర్చుపెట్టాలని ప్రశ్నించారు. మీ సోకులు, ఢిల్లీకి పైసల కోసం మాత్రమే మీరు మూసీ అనే పని పెట్టుకున్నారని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో సహా ఎన్నికల్లో ఓడిపోవటానికి మనం కూడా కొన్ని చిన్న తప్పులు చేశామని, కానీ ఒక్కోసారి ఓటమి కూడా మన మంచికేనన్నారు. లక్ష మందికి ఉపాధి కల్పించే విధంగా ప్రైవేట్ రంగంలో ఫాక్స్ కాన్ సంస్థను ఇక్కడ కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. పైన రేవంత్ రెడ్డి ఎట్ల ఉన్నాడో...ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అదే విధంగా దోపిడీకి పాల్పడుతున్నాడని ఆరోపించారు.

Advertisement

Next Story