సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్

by Nagaya |   ( Updated:2022-12-12 14:34:13.0  )
సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : గిరిజనులు, ఆదివాసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నదని, ఆ ప్రక్రియ పూర్తయ్యి తీర్పు వెలువడిన తర్వాత మాత్రమే ఒక స్పష్టత ఏర్పడుతుందని కేంద్ర ఎస్టీ వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణకు చెందిన రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా పై విషయాన్ని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎస్టీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన లేఖ అందినట్లు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదం తర్వాత రాష్ట్రపతి అప్రూవల్ కోసం కేంద్ర హోంశాఖకు పంపిందని, అక్కడి నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరిందని, కానీ దీనిపై నిర్ణయం తీసుకోడానికి సుప్రీంకోర్టులో పలు పిటిషన్లపై విచారణ పెండింగ్‌లో ఉండడమే కారణమని కేంద్ర మంత్రి ఆ సమాధానంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఐదేండ్ల క్రితం పంపిన బిల్లుకే ఆమోదం లభించకపోవడంతో ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశంపై మరోమారు బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబరులో జీవో కూడా జారీచేసింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఈ బిల్లుకు ఆమోదం తెలపకపోవడంతో రానున్న కాలంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక పొలిటికల్ ఘర్షణకు కారణమయ్యే అవకాశమున్నది.

Advertisement

Next Story