నాడు పర్మీషన్.. నేడు ఎమోషన్..! దిలావర్‌పూర్ పాపం గులాబీ పార్టీదే

by Shiva |
నాడు పర్మీషన్.. నేడు ఎమోషన్..! దిలావర్‌పూర్ పాపం గులాబీ పార్టీదే
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత రాష్ట్ర సమితి తీరు.. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, అధికారం పోగానే అందుకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఉండగా అనుమతులు ఇచ్చి.. అధికారం పోగానే అదే అంశంపై రాద్ధాంతం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చేసిన పనే తమకు ఎక్కడ రివర్స్ అవుతుందోననే విషయాన్ని గ్రహించి రాజకీయం చేయడం బీఆర్ఎస్‌కు పరిపాటిగా మారింది. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం నేర్చిన గులాబీ పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు చేసినవన్నీ కరెక్టు అన్నదని, ఇప్పుడు మాత్రం తప్పుగా చెప్తున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడలా.. ఇప్పుడిలా..

నిర్మల్ జిల్లా దిలా‌వర్‌పూర్‌లో ఇథనాల్ పరిశ్రమకు అన్ని రకాల అనుమతులు, మినహాయింపులు ఇచ్చిన బీఆర్ఎస్.. ఇప్పుడు పరిశ్రమల పెట్టొద్దు, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలంటూ అరుపులు, పెడబొబ్బలు, గావు కేకలు పెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై శాపనార్ధాలు పెడుతోంది. పవర్‌లో ఉన్నపుడు పరిశ్రమకు ప్రతి అనుమతి ఇచ్చిన గులాబీ పార్టీ.. ఇప్పుడు మాత్రం తాము ప్రజల పక్షం అంటూ తన అవకాశవాదాన్ని మరో సారి బయటపెట్టుకుందని రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు అనుమతి ఇస్తే.. అదేమీ పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి.. అన్ని ఉత్పత్తులకు రాష్ట్ర మంత్రివర్గం దర్జాగా పర్మిషన్ ఇచ్చింది. ఫ్యూయల్ ఇథనాల్ సాకు చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఈ కంపెనీ అడ్డదారులు తొక్కింది.

అప్పటి సర్కారు కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు పర్మిషన్స్ ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ) నుంచి ఈ కంపెనీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) తీసుకోవడం తప్పనిసరి. కానీ, పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలుండటంతో పర్యావరణ అనుమతుల నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించింది. 2022 అక్టోబరు 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్/ ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్/అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అప్పటి సర్కారు రాష్ట్ర కేబినేట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసింది. 2022 డిసెంబర్‌లో కేబినెట్ ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసింది.

‘ఫ్యూయల్ ఇథనాల్’కు మాత్రమే కేంద్రం అనుమతి

పీఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ కేంద్ర పర్యావరణశాఖకు ఫ్యూయల్ ఎథనాల్ కోసమే దరఖాస్తు చేసింది. అక్కడ ప్రతిపాదించిన 300 కిలో లీటర్ పర్ డే(కేఎల్‌పీడీ) సామర్థ్యం మొత్తం ఫ్యూయల్ ఎథనాల్ తయారీకేనని స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించింది. దాని ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందని, ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయింపునిచ్చారు. 2023 ఫిబ్రవరి 24న కేంద్ర పర్యావరణ శాఖ ‘ఫ్యూయల్ ఇథనాల్’ ఉత్పత్తికి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. కాగా, అప్పటి రాష్ట్ర సర్కారు 2023 ఏప్రిల్ 1న ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌లో ఫ్యూయల్ ఇథనాల్‌‌కు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను మరోసారి జారీ చేసింది. దానిని చూపించి పీవోకే కంపెనీ 2023 జూన్ 7న ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 2023 జూన్ 15నన నీటిపారుదల శాఖ ఆదిలాబాద్ చీఫ్ ఇంజినీర్ నీటి కేటాయింపులకు అనుమతినిచ్చారు. అలా 2023 డిసెంబర్ 7కు ముందే టీఎస్ ఐపాస్ ద్వారా ఈ కంపెనీకి అనుమతులన్నీ జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed