32 ఎకరాల చెరువును కబ్జా చేసింది ఎవరు..? రామంతాపూర్ పెద్ద చెరువుపై హైడ్రా ఫోకస్ పెట్టేనా..?

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-08-27 15:33:50.0  )
32 ఎకరాల చెరువును కబ్జా చేసింది ఎవరు..? రామంతాపూర్ పెద్ద చెరువుపై హైడ్రా ఫోకస్ పెట్టేనా..?
X

దిశ, మేడ్చల్ బ్యూరో/ఉప్పల్ : సొంతిల్లు కట్టుకునేవాలనుకునే వారికి ఆశ చూపెట్టారు. చెరువు అక్రమిత ప్రాంతాల్లోని భూమి అమ్మేసీ నట్టెట్టా ముంచేశారు. లాలూచీ పడ్డ కొందరు అధికారులు పట్టా పని కూడా కానిచ్చేశారు. ఇదీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని కొందరు అక్రమార్కులు సాగించిన స్థిరాస్తి దందా.. ఇందుకు ఉదాహరణే కుచించుకుపోయిన రామంతాపూర్ పెద్ద చెరువు... రామంతాపూర్ చెరువును సులువుగా కబ్జా చేసేశారు.

చెరువు వ్యధ..

ఒకపుడు సాగు, తాగునీటి వనరుగా ఉన్న రామంతాపూర్ పెద్ద చెరువు.. కాలక్రమేణా మురికి కూపంగా మారిపోయింది. చేపల పెంపకం ద్వారా వేల కుటుంబాలకు జీవనాధారంగా ఈ జలాశయం.. ఇప్పుడు చెత్త, చెదారం, పూడిక పేరుకుపోయి సహజత్వాన్ని కోల్పోయింది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని ఉప్పల్ మండలంలోని రామంతాపూర్ పెద్ద చెరువు... సర్వేనెంబర్ 42, 43, 63, 64, 65, 66 లలో ఒకప్పుడు 51 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ప్రస్తుతం ఆక్రమణలకు గురై 19 ఎకరాలకు కుచించుకుపోయింది.

అడ్డగోలుగా అక్రమణలు

వరంగల్ జాతీయ రహదారిని అనుకొని ఉన్న రామంతాపూర్ పెద్ద చెరువు శివారులో పలు కాలనీలు ఏర్పాడ్డాయి. ఓయూ నుంచి చెరువులోకి నీరు వచ్చే చాలా కాలువులపై ఇళ్లు, భవనాలు వెలిశాయి. నాలాలకు అడ్డంగా మట్టిదిబ్బలు, గోడలు కట్టి ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేశారు. చాలా చోట్ల నాలాల సహజ మార్గాన్ని మార్చి పై నుంచి ఇళ్లు నిర్మించుకున్నారు. కాలువ రూటు మార్చడం, విస్తీర్ణం తగ్గించటంతో మ్యాన్ హోళ్ల వెంబడి ధారళంగా వరద నీరు బయటకు పొంగి పోతోంది. ఎక్కడికక్కడ గోడలు పడిపోయి, వరద నీరు ముంచెత్తుతోంది. చెరువుకు అతి సమీపంలో ఉన్న సాయిచిత్ర నగర్ కాలనీ నీట మునుగుతోంది. కొన్ని రోజుల పాటు ముంపులోనే ఉంటుంది. చిన్న పాటి వర్షాలకే రవీంద్రనగర్, సత్య నగర్, సీబీఎన్ నగర్‌లోని చాలా కాలనీల్లో ఇళ్లు మునిగిపోతాయి. చెరువుకుండే తూముల మూసివేత.. ఆక్రమణలతో లో తట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఓ మోస్తరు వర్షానికి భయపడే పరిస్థితి నెలకొంది.

జీవనాధారం కొల్పోయిన 2వేల కుటుంబాలు

పాతికేళ్ల కిందట రామంతాపూర్ పెద్ద చెరువుపై 2వేల కుటుంబాలు అధారపడి జీవనం సాగించేవారు. పట్టణీకరణ నేపథ్యంలో తటాకం కబ్జాలకు గురయ్యాయి. మురికి నీరు, గుర్రపు డెక్క పేరుకుపోయి చెరువు సహజత్వాన్ని కొల్పోయింది. మరోవైపు చిన్న చెరువు విస్తీర్ణం 19 ఎకరాలుండగా, ఆక్రమణలతో 9 ఎకరాలే మిగిలింది. చెరువు కట్ట సైతం కబ్జాకు గురై నిర్మాణాలు వెలిశాయి. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మత్స్య కార సొసైటీ సభ్యులు, స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని గంగపుత్రలు వాపోతున్నారు. డ్రైనేజీ సైతం చెరువులో కలిసి పోయి చేపల పెంపకానికి పనికి రాకుండా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కోర్టు ఉత్తర్వులు బేఖాతరు..

చెరువు భూములలో ఇళ్లు కట్టొద్దని 1998లో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయినా కొందరు దొడ్డిదారిన అనుమతులు తెచ్చుకొని యథేచ్ఛగా చెరువు చుట్టూ ఇళ్లను నిర్మించుకున్నారు. మరి కొందరు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అపార్ట్ మెంట్లు, భవనాలను నిర్మించారు. చెరువు వరద నీరు బయటకు వెళ్లేందుకు మూసీ నాలా వరకు వరద నీటి కాలువను నిర్మించినప్పటికీ, ఆ కాలువను అక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడం వల్ల లో తట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోతున్నాయి. హైడ్రా చెరువులో నిర్మించిన అక్రమణలను తొలగించాలని, అర్బన్ లేక్ పరిధిలో రామంతాపూర్ పెద్ద చెరువు పునరుద్ధరించాలని, ఎఫ్‌టీఎల్, చెరువు సరిహద్దులను నిర్ణయించి శాశ్వత పరిష్కారం ప్రభుత్వం చూపించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story