TPCC Chief: రిలాక్స్ కావొద్దు.. ఆ విషయం ప్రతి ఇంటికి చేర్చండి

by Gantepaka Srikanth |
TPCC Chief: రిలాక్స్ కావొద్దు.. ఆ విషయం ప్రతి ఇంటికి చేర్చండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తొమ్మిదిన్నరేండ్ల నిరంకుశ పాలనను గద్దె దించడంలో ఎంతో కష్టపడి పనిచేసిన పార్టీ కేడర్, లీడర్లు ఇప్పుడు విశ్రాంతి మూడ్‌లోకి వెళ్ళారని, ఆ వైఖరిని వీడి మళ్ళీ యాక్టీవ్ కావాలని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆనాడు పడిన కష్టాన్ని గుర్తించిన పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. వివిధ కార్పొరేషన్‌లకు చైర్ పర్సన్‌లుగా నియమించాలని, ఇప్పుడు మరింత కష్టపడి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతిపక్షాలను గుక్క తిప్పుకోకుండా చేయాలని కోరారు. వారితో ప్రత్యేకంగా సమావేశమైన పీసీసీ చీఫ్.. పది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులు, సాధించిన ప్రగతిపై విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని, ప్రతి ఇంటికీ చేరేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు వాటిలోని డొల్లతనాన్ని అసెంబ్లీ ఎన్నికలకు ముందు విస్తృతంగా ప్రజలకు వివరించారని, 45 లక్షల మందిని డిజిటల్ మెంబర్‌షిప్ డ్రైవ్ ద్వారా పార్టీ సభ్యులుగా చేర్పించారని గుర్తుచేశారు. దేశంలోనే అత్యుత్తమ ఫలితాలు సాధించి తెలంగాణకు పార్టీ హై కమాండ్ నుంచి ప్రత్యేక గుర్తింపు వచ్చిన విషయాన్ని పీసీసీ చీఫ్ గుర్తుచేశారు.

అంత కష్టపడినందునే కేసీఆర్ నియంత పాలనను అంతం చేసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేగలిగారని, ఇప్పుడు కూడా అదే కసితో పనిచేసిన హైడ్రా, మూసీ తదితర అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి బ్రేక్ వేయాలని పీసీసీ చీఫ్ కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాల్సినవారు చాలా మంది ఇక్కడ ఉన్నారని, జిల్లాల ఈక్వేషన్లతో పాటు సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నామినేటెడ్ పదవులు వచ్చాయన్నారు. గత కొంతకాలంగా చాలామంది పార్టీ నేతలు, వివిధ అనుబంధ సంఘాల లీడర్లు రిలాక్స్ మూడ్‌లోకి వెళ్ళినట్లు కనిపిస్తున్నదని, దీన్నుంచి బైటపడి మళ్లీ యాక్టివ్ కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారని, రోజుకో కొత్త విధాన నిర్ణయం, సంక్షేమ పథకంతో ప్రజలకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కలిగిస్తున్నారని, ఆ కృషికి తోడుగా నామినేటెడ్ చైర్‌పర్సన్ల పాత్ర కూడా జత కలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల మరింత అవగాహన పెంచుకుని ప్రతి ఇంటికీ తీసుకెళ్ళాలని అప్పీల్ చేశారు.

ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని, ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కోరారు. మరింత దూకుడుగా పనిచేసేందుకు సమాయత్తం కావాలని, సోషల్ మీడియాను సైతం విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల గృహ విద్యుత్ ఉచిత సరఫరా, రూ. 500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ, స్కిల్ యూనివర్శిటీ, స్పోర్టస్ వర్శిటీ, విదేశాల నుంచి రూ. 80 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, యువతకు ఉపాధి అవకాశాలకు జరుగుతున్న కృషి, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు.. ఇలాంటి అనేక విషయాలను గ్రామాల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. ఇందుకోసం సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లను బాగా వాడుకోవాలని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే కాక కాంగ్రెస్‌ను, నేతలను టార్గెట్ చేస్తూ ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని కోరారు.

Next Story

Most Viewed