PCC chief: ప్రధాని భార్య గురించి మేము అడగలేమా?.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
PCC chief: ప్రధాని భార్య గురించి  మేము అడగలేమా?.. పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మన దురదృష్టం కొద్దీ గాడ్సే వారసులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద విలువలు లేకుండా బీజేపీ నేతలు వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి రణ్వీర్ బిట్టు, బీజేపీ ఎమ్మెల్యే తన్విందర్ సింగ్, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యేలు తీవ్రవాదులు మాదిరి మారుతుంటే వారిపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. బుధవారం వరంగల్ లో పర్యటించిన ఆయన అక్కడ డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడి మీద మాటల దాడి జరుగుతుంటే ప్రధాని, హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

రాహుల్ ఆషామాషీ లీడర్ కాదు..

రాహుల్ గాంధీ ఆషామాషీ లీడర్ కాదని ఆయన ఈ దేశమంతా ఎదురు చూస్తున్న మనందరి భవిష్యత్ అన్నారు. అలాంటి రాహుల్ గాంధీకి ఇందిరా గాంధీకి పట్టిన గతి పడుతుంది అంటే.. ఎంత క్రూరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇందిరా గాంధీ ఎందుకు చనిపోయింది? ఆస్తుల కోసమా స్వప్రయోజనాల కోసమా? ఈదేశ భద్రత కోసం ఆమె తీవ్ర వాదుల చేతిలో చనిపోయారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. దేశ చరిత్రలో ఎవరూ లేని విధంగా స్వాతంత్ర్య పోరాటం లో 16 సంవత్సరాలు నెహ్రూ జైల్లో ఉన్నారన్నారు. మోడీ, అమిత్ షా ఈ దేశం కోసం ఏనాడైనా జైలుకు వెళ్ళారా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా అమిత్ షా తక్షణమే రాహుల్ గాంధీపై మాట్లాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని డిమాండ్ చేశారు. లేదా వారి వెనుక ఉండి బీజేపీనే ఇదంతా చేయిస్తోందని భావించాల్సి ఉంటుందన్నారు. వారు గాడ్సే వారసులు అనుకుని కేసులు పెట్టకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలన్నారు.

మేము తలుచుకుంటే బీజేపీ నామ రూపాలు ఉండవు:

మేము తలుచుకుని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేస్తే బీజేపీ నామ రూపాలు లేకుండా పోతుందని మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలకు కుటుంబాలను అవమాన పర్చడం అలవాటుగా మారిందని కుటుంబాలను అనాలనుకుంటే మేము ప్రధాన మంత్రి గారు మీ భార్య ఎక్కడ అని డగలేమా? అడుగి అవమాన పర్చలేమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలను అడుగుతున్న మీ పార్టీ నేతలు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నారా? మీ పార్టీ విధానం ఇదేనా చెప్పాలన్నారు. బీజేపీ నేతలు నెహ్రూను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని కానీ రాహుల్ గాంధీ ఓ శక్తిగా మారారని రేపు దేశంలో మరింత శక్తివంతంగా మారబోతున్నారన్నారు.

భయంతోనే మాటల దాడి:

హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతున్నదనే భయంతోనే బీజేపీ నేతలు రాహుల్ గాంధీపై ఈ తరహాలో మాటల దాడి చేస్తున్నారని మహేశ్ కుమార్ ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ, మహారాష్ట్ర లో శివసేన (షిండే వర్గం) తుడుచుకుపెట్టుకుపోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. కేవలం మతం అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ మాట్లాడితే కులం, మతం పేరు చెప్పి రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. నేను, మంత్రి పొన్నం ప్రభాకర్ హిందూ మతంలో పుట్టామని రోజు గుళ్లో పూజలు చేస్తామన్నారు. వేరే మతం, వేరే కులం గురించి మాట్లాడే హక్కు, కించపరిచే హక్కు ఏ రాజ్యాంగం లో ఉందని ప్రశ్నించారు. కేంద్రంలోని పాసిస్ట్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వచ్చే రోజుల్లో అధికారంలోకి రామనే భావనతోనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేసిన వారిపై తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కేసులు పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed