పార్లమెంట్ ఎన్నికలు.. కొత్త ఓటర్లకు బీజేపీ గాలం

by Mahesh |   ( Updated:2024-01-25 03:17:00.0  )
పార్లమెంట్ ఎన్నికలు.. కొత్త ఓటర్లకు బీజేపీ గాలం
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ మార్క్​ను టచ్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా కొత్త ఓటర్లకు గాలం వేయనుంది. ఇందుకోసం పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు 'నమో నవమత దాత సమ్మేళనం' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకత్వం చేపట్టనుంది. యువ ఓటర్లు ఎంతమంది తమకు మద్దతుగా నిలుస్తారనేది తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించనుంది. మిస్డ్​ కాల్​, క్యూ ఆర్ కోడ్ ద్వారా వివరాలు నమోదు చేసుకునేందుకు పార్టీ అవకాశం కల్పించింది.

తెలంగాణలో బీజేపీ కమలం పువ్వు గుర్తు తో పోలిస్తే కాంగ్రెస్ హస్తం గుర్తు ఎక్కువ పరిచయం. దీన్ని అధిగమించటంతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ వ్యూహ రచన చేసుకుంది. ఇందుకోసం యువ ఓటర్ల మద్దతు తమకెంత ఉందో తెలుసుకునేందుకు నమో నవమత దాత కార్యక్రమాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ వర్చువల్​గా ప్రసంగించనున్నారు. అంతేకాకుండా వాల్​ రైటింగ్​పైన దృష్టి పెట్టింది. ఈ నెల 31 లోపు వాల్ రైటింగ్స్ పూర్తి చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆదేశించారు. ఒక్కో పార్లమెంట్ పరిధిలో 2 వేల చోట్ల గోడ రాతలు, ప్రతి పోలింగ్ బూత్​లో 5 చోట్ల వాల్ రైటింగ్స్ ఉండాలని స్పష్టం చేశారు.

వరుస యాత్రలతో...

ప్రధానంగా మహిళా, యువ ఓటర్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాలతో మాతృ శక్తి సమావేశాలతో పాటు యువ సమ్మేళనాలు సైతం నిర్వహించాలని జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలను ఆదేశించింది. అంతేకాకుండా వచ్చే నెలలో కిసాన్ మోర్చా జాతీయ స్థాయి సమ్మేళనం హైదరాబాద్‌లో నిర్వహించాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న అమిత్ షా పర్యటన పైన బన్సల్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 10 నుంచి నిర్వహించే రథయాత్రలపైనా చర్చించారు. ఈ నెల 26న తిరంగా యాత్రలు నిర్వహించాలని ఆదేశించారు. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులతో బీజేపీ సమావేశాలు నిర్వహించనుంది. అలాగే ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో గావ్​ చలో.. ఘర్ చలో కార్యక్రమాలు చేపట్టనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్​ను రీచ్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న బీజేపీ వ్యూహాలు ఎంతమేరకు ఫలితాన్ని ఇస్తాయో చూడాలి.

Advertisement

Next Story