‘‘ముక్కు నేలకు రాయ్’’.. MLA ఈటలపై పాల్వాయి స్రవంతి తీవ్ర విమర్శలు

by Satheesh |
‘‘ముక్కు నేలకు రాయ్’’.. MLA ఈటలపై పాల్వాయి స్రవంతి తీవ్ర విమర్శలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: “ఈటల రాజేందర్.. నువ్వు కూడా ఆరోపణలు చేస్తూ రాజకీయం పబ్బం గడుపుతున్నావా? బీజేపీలోకి వెళ్లిన తర్వాత మీ మైండ్​పనిచేయట్లే. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేసీఆర్ రూ. 25 కోట్లు ఇచ్చినట్లు మీరు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. దమ్ముంటే ఆధారాలతో రుజువు చేయు. లేదంటే ముక్కు నేలకు రాసి కాంగ్రెస్​పార్టీ, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పు” అంటూ మునుగోడు కాంగ్రెస్​పార్టీ ఇంచార్జీ పాల్వాయి స్రవంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‌లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్​కాంగ్రెస్‌కు డబ్బులు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు.

దర్యాప్తు సంస్థలన్నీ బీజేపీ చేతిలోనే ఉన్నాయని, పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయొచ్చన్నారు. ఎన్నికలు పూర్తైన ఆరు నెలల తర్వాత ఇలాంటి ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్​పార్టీ కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీయాలని ప్రయత్నిస్తే.. చూస్తూ ఊరకోమని ఆమె హెచ్చరించారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఆయన విఫలం కావడంతో ఈటల ఇలా ప్రవర్తిస్తున్నారని స్రవంతి మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేస్తే అనేక అవరోధాలను బీజేపీ, బీఆర్‌ఎస్‌లు సృష్టించారన్నారు. డబ్బు గురించి మాట్లాడుతున్న ఈటల రాజేందర్.. అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎలా? వచ్చిందో స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్ నేతను బీజేపీ కొనడం వలనే బై ఎలక్షన్​వచ్చిందని స్రవంతి గుర్తు చేశారు.

బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెప్పినా ప్రవర్తన మారలేదన్నారు. ఈటల రాజేందర్ తన రాజకీయ అనుభవాన్ని ఇలాంటి విమర్శలకు ఉపయోగించడం విచిత్రంగా ఉన్నదన్నారు. కాంగ్రెస్‌కు కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదు అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్తున్నారని, దమ్ముంటే ఈటల కూడా వెళ్లి తన నిజాయితీని చాటుకోవాలని హితవు పలికారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌కు ఈటల స్పందించాలన్నారు. బీజేపీ నేతలు సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం అయ్యారన్నారు. బీజేపీ ఆటలు నడవడానికి ఇది నార్త్ ఇండియా కాదని నొక్కి చెప్పారు. తెలంగాణ ఉద్యమకారుడిగా ఈటల నైతికత ఎక్కడికి పోయిందో? అర్థం కావడం లేదన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమైందన్నారు. ఇక అదానీ కుంభకోణాన్ని బయటపెట్టినందుకే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారన్నారు. కాంగ్రెస్​అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిచర్యలు తప్పవని సుజాత హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed