Gussadi Kanakaraju : "పద్మశ్రీ అవార్డు" గ్రహీత గుస్సాడీ కనకరాజు మరణం

by M.Rajitha |   ( Updated:2024-10-25 16:20:14.0  )
Gussadi Kanakaraju : పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు మరణం
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రముఖ గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు(PadmaSri Award) గ్రహీత గుస్సాడీ కనకరాజు(Gussadi Kanakaraju) శుక్రవారం తన స్వగ్రామం మర్లవాయిలో కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కనకరాజు.. నేడు తుదిశ్వాస విడిచారు. గోండు కుటుంబంలో పుట్టి, తమ ప్రత్యేక గిరిజన నృత్యరూపం అయిన గుస్సాడీ అంతరించి పోకూడదనే లక్ష్యంగా, గుస్సాడీనే తన ఇంటి పేరుగా మార్చుకొని వేలాది మందికి ఆయన గుస్సాడీ నృత్యాన్ని నేర్పించారు. గుస్సాడీ నృత్యాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికల మీదికి ఎక్కించి.. తమ కళను ఎల్లలు దాటించారు. కళారంగంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం కనకరాజును 2021లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. కాగా శనివారం ఆయన స్వగ్రామం అదిలాబాద్ లోని మర్లవాయిలో జరుగుతాయని కుటుంబ సభ్యులు ప్రకటించారు.

సంతాపం తెలిపిన మంత్రి సీతక్క

గుస్సాడీ కనకరాజు మృతి పట్ల పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తీవ్ర సంతాపం వ్యక్తపరిచారు. కనకరాజు మృతితో గుస్సాడీ ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని.. గుస్సాడీ నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన విలక్షణమైన కళాకారుడుగా కనకరాజు తన పేరును సుసంపన్నం చేసుకున్నారని అభిప్రాయపడ్డారు. కనకరాజు లేకుండా గుస్సాడీ నృత్యాన్ని ఊహించుకోవడం కష్టమని, వందల కొద్దీ గుస్సాడీ ప్రదర్శనలు ఇవ్వడమే గాక ఎంతోమందికి గుస్సాడీ నృత్యం నేర్పించిన ఆయన సేవలను సీతక్క గుర్తు చేసుకున్నారు. కనకరాజు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed