బీజేపీపై వ్యతిరేకతే కామన్ ఎజెండా.. సభలో కాంగ్రెస్‌ ఊసెత్తని నేతలు..!

by Hajipasha |
బీజేపీపై వ్యతిరేకతే కామన్ ఎజెండా.. సభలో కాంగ్రెస్‌ ఊసెత్తని నేతలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు హాజరైన సీపీఐ, సీపీఎం, ఆప్, ఎస్సీ పార్టీ నేతలు ముక్తకంఠంగా బీజేపీపై ఫైర్ అయ్యారు. కానీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడా ప్రస్తావించలేదు. బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తామని కూడా ఎక్కడ చెప్పలేదు. దీంతో దేశ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఇతర పార్టీల మద్దతు లభించడం కష్టమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు కేసీఆర్ పిలిచిన వెంటనే పలు కార్యక్రమాలకు హాజరైన జేడీఎస్ నేత కుమారస్వామి ఖమ్మం సభకు గైర్హాజరయ్యారు.

బీఆర్ఎస్‌కు మద్దతిస్తారా?

ఖమ్మం సభతో దేశ ప్రజలను ఆకట్టుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశారు. అందుకోసం ఇతర పార్టీలకు చెందిన పెద్ద లీడర్లను సభకు ఆహ్వానించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా హాజరయ్యారు. వీరంతా బీజేపీ పాలన, రాజకీయ విధానాలపైనే ఫోకస్ పెట్టి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ఇతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేడమే పనిగా పెట్టుకుందని బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ విధానాలపై, రాహుల్ పాదయాత్రను ప్రస్తావించలేదు. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ గురించి ఎవరూ మాట్లాడలేదు. తెలంగాణ‌లో అమలవుతున్న కొన్ని పథకాలపై ప్రశంసలు కురిపించారు. దీంతో సభకు హాజరైన ఇతర పార్టీల లీడర్లు బీఆర్ఎస్‌కు సపోర్టుగా ఉంటారా? అనే చర్చ మొదలైంది.

కనిపించని కుమారస్వామి

బీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్నప్పట్నించి జేడీఎస్ నేత కుమార స్వామి కేసీఆర్ నిర్వహించిన పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. పార్టీకి ఈసీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యవర్గ సమావేశంలోనూ పాల్గొన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కానీ, ఖమ్మం సభలో మాత్రం ఆయన కనిపించలేదు. త్వరలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నందున అందులో ఆయన బిజీగా ఉన్నారని, అందుకే సభకు రాలేకపోయారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Next Story