HYD: నగర హోటళ్లపై మెరుపు దాడులు.. మేయర్‌పై సొంత నేతల విమర్శలు

by Gantepaka Srikanth |
HYD: నగర హోటళ్లపై మెరుపు దాడులు.. మేయర్‌పై సొంత నేతల విమర్శలు
X

దిశ, సిటీబ్యూరో: మేయర్ గద్వాల విజయలక్ష్మి దూకుడు పెంచారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టి డిసెంబర్ 20 నాటికి నాలుగేండ్లు పూర్తవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడేండ్లపాటు సైలెంట్‌గానే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరి దూకుడు పెంచారని పలువురు కార్పొరేటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుడ్ సేఫ్టీలో భాగంగా నగరంలోని కొన్ని హోటళ్లపై ఆకస్మికంగా తనిఖీలు చేయడం, రెగ్యులర్‌గా ప్రజావాణిలో పాల్గొనడం, టౌన్ ప్లానింగ్ విభాగంపై తరుచుగా సమీక్షలు చేయడం వంటి కార్యక్రమాలతో హడావుడి చేస్తున్నారని సొంత పార్టీ, ప్రతిపక్షపార్టీల కార్పొరేటర్లు సైతం విమర్శిస్తున్నారు.

ఆ హోటళ్లపై తనిఖీలతో..

కొద్ది రోజుల క్రితం మేయర్ తన సొంత పార్టీకి చెందిన నేతల హోటళ్లపై మెరుపుదాడులు నిర్వహించి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీలపై అప్పట్లో సొంత పార్టీలోనే రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మేయర్ కార్యాలయంలో ఓ రిటైర్డ్ అధికారి హోటళ్ల తనిఖీలు, టౌన్ ప్లానింగ్ విభాగం విషయంలో తప్పుడు సమాచారం అందిస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఓ కార్పొరేటర్, మరో ఎంపీకి చెందిన హోటళ్లపై ఆమె తనిఖీలు నిర్వహించటం పార్టీలోనూ చర్చనీయంగా మారింది. మేయర్‌ను తన కార్యాలయ సిబ్బంది తప్పుదోవపట్టిస్తున్నారనే విమర్శలూ లేకపోలేదు.

టార్గెట్ టౌన్ ప్లానింగ్..

ప్రధాన కార్యాలయంలోని పలు విభాగాల్లో మేయర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అటెండెన్స్ పారదర్శకంగా ఉండేందుకు వీలుగా వినియోగిస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలవుతున్న విషయాన్ని పరిశీలించేందుకు ఆమె పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించి, విధులకు లేటుగా రావడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కూడా తనిఖీ చేయగా, కింది స్థాయి సిబ్బంది విధులకు హాజరైనా అడిషనల్ సీసీపీలు, జోనల్ ఏసీపీలు సీట్లలో కనిపించకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఫీల్డు తనిఖీలు నిర్వహించుకుని, ఆ తర్వాత ఆఫీసులోని తమ చాంబర్లలో సందర్శకులకు అందుబాటులో ఉంటారు. ఈ క్రమంలో ఈ విషయం మేయర్‌కు తెలీదా? తెలిసినా, ఆ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారా? లేక ఈ తనిఖీల వెనుక అసలు ఆంతర్యమేమిటీ? అన్నది చర్చనీయాంశంగా మారింది.

అనుచరులకు అందలం..

రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలను వ్యాపారవేత్తలుగా చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మేయర్ తన అనుచరులకు జీహెచ్ఎంసీ పరిధిలో పెద్దపీట వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంపై అర్బన్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ (యూసీడీ) విభాగానికి చెందిన అధికారులతో చర్చించినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed