వెయ్యి కిలోమీటర్లకు పూర్తయింది 430 కిలోమీటర్లే!

by karthikeya |
వెయ్యి కిలోమీటర్లకు పూర్తయింది 430 కిలోమీటర్లే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం తగ్గు ముఖం పట్టినా.. ఆయా ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి అటవీశాఖ నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి. భూసేకరణ చేయలేకపోతుండడంతో రోడ్ల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం 2017లో కేంద్ర ప్రభుత్వం వెయ్యి కిలోమీటర్ల రహదారులు, 40 వంతెనలను మంజూరు చేసింది. అయితే ఇప్పటి వరకు కేవలం 430 కిలోమీటర్ల రోడ్లు, 19 వంతెనలు మాత్రమే పూర్తయినట్లు తెలిసింది. ఇంకా రూ. 636 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నా.. అటవీ శాఖ అనుమతులు లభించని కారణంగా వాటిని ఉపయోగించలేని పరిస్థితి ఉన్నదని ఆర్ అండ్ బీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రహదారులు ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో మంజూరయ్యాయి. అయితే ఈ రోడ్ల నిర్మాణానికి అటవీ శాఖ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత.. రెవెన్యూశాఖ భూమిని అప్పజెప్పాల్సి ఉంటుంది. అయితే అనుమతులు లభించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. నిబంధనలు కొంతమేర సడలించాలని కేంద్ర అధికారులను కోరుతున్నా.. పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర అటవీ శాఖల అధికారులు ప్రతి వారం సమావేశాలు నిర్వహిస్తున్నా.. అనుమతులకుసంబంధించి అటవీ శాఖ రూల్స్ అడ్డంకిగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. రాష్ట్ర సర్కారు పెద్దలు నేరుగా కేంద్రంతో మాట్లాడితేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర నిధులే వినియోగించాలని రాష్ట్రం వినతి

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే వంద శాతం కేంద్ర నిధులనే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, భద్రతా దళాలు వెళ్లడానికి ఈ రోడ్లే కీలకమని గుర్తు చేస్తున్నది. అంతర్గత భద్రతను జాతీయ ప్రాధాన్యాంశంగా మార్చి, 60:40 నిష్పత్తిలో కాకుండా మొత్తం నిధులు ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నది.

Advertisement

Next Story

Most Viewed