ఫ‌ల‌హారంలా కోట చెరువు శిఖం భూమి.. తూతూ మంత్రంగా కూల్చివేత‌లు

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-27 16:09:01.0  )
ఫ‌ల‌హారంలా కోట చెరువు శిఖం భూమి.. తూతూ మంత్రంగా కూల్చివేత‌లు
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వ‌రంగ‌ల్ జిల్లా ములుగు రోడ్డులోని కోట చెరువులో భూక‌బ్జాలు య‌థేచ్ఛ‌గా కొన‌సాగుతునే ఉన్నాయి. ముందు పేద‌లు.. వెనుక గ‌ద్ద‌లు అన్న‌చందంగా మారింది. చెరువులో ప‌ట్టాలున్నాయ‌ని పేర్కొంటూ కొంత‌మంది శిఖం భూముల‌ను చ‌దును చేయ‌డం, పూడ్చివేయ‌డం చేస్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవ‌ల్ నిబంధ‌నల‌ను తుంగ‌లో తొక్కుతూ అక్ర‌మంగా నిర్మాణాలు చేప‌డుతున్నారు. అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫ‌లితంగా రాత్రికి రాత్రే.. శిఖంలో మొరం, మ‌ట్టిని డంప్ చేసి..తాత్క‌లిక నిర్మాణాల‌ను చేప‌డుతున్నారు. గ‌త ప‌దేళ్లుగా ఈ వ్య‌వ‌హారం కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే చెరువు శిఖం భూములు సుమారు 20 ఎక‌రాల వ‌ర‌కు అన్యాక్రాంత‌మైంది. జీడ‌బ్ల్యూఎంసీ ప‌రిధిలోనే అతిపెద్ద విస్తీర్ణం క‌లిగిన ఈ చెరువు నానాటికి కుంచించుకుపోతోంది. హైకోర్టు ఆదేశాల‌తో ఇటీవ‌ల చెరువు శిఖంలోని కొన్ని నిర్మాణాలు కూల్చివేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు కొర్రీలు వెతుక్కుని మ‌రీ మిగ‌తా వాటిని మాత్రం ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

కొన‌సాగుతున్న నిర్మాణాలు..!

వ‌రంగ‌ల్ మండ‌లంలో మ‌ట్వాడ రెవెన్యూ ప‌రిధిలోని స‌ర్వే నెంబ‌ర్ 352లో ఉన్న ఈ చెరువు 159.8 ఎక‌రాల విస్తీర్ణంలో ఉంది. ములుగు-వ‌రంగ‌ల్ హైవేను ఆనుకుని ఉన్న ఈచెరువు గ‌త కొన్నేళ్లుగా కొంత‌మంది భూ బ‌కాసురుల క‌న్ను ప‌డింది. శిఖం భూముల‌ను ఆక్ర‌మిస్తున్నారు. చెరువులో ప‌ట్టాలు ఉన్నాయ‌ని చూపుతూ చ‌దును చేసేస్తున్నారు. ఎఫ్‌టీఎల్‌ను చెరిపివేస్తూ డాక్ట‌ర్స్ కాల‌నీ-2లో శివ‌న‌గ‌ర్ వైపు వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారికి ఆనుకుని ఉన్న క‌ట్ట‌పైనా,మెయిన్ రోడ్డు నుంచి క‌ట్ట‌లోప‌లి వైపు చెరువు శిఖం భూముల్లో నిర్మాణాలు జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం. డాక్ట‌ర్ కాల‌నీ-2 వైపు చెరువు క‌ట్ట‌నే ధ్వంసం చేసి.. అస‌లు చెరువులో నీరు నిల్వ‌కుండా చేసేశారు. వ‌ర‌ద నీరు వ‌చ్చింది వ‌చ్చిన్న‌ట్లుగా బ‌య‌ట‌కు వెళ్తోంది. ఎఫ్టీఎల్ ను త‌గ్గించి చూపేలా కుట్ర చేస్తూ... అక్ర‌మాల‌ను స‌క్ర‌మం చేసేస్తున్నారు. ఇదంతా అటు రెవెన్యూ, ఇరిగేష‌న్ అధికారుల‌కు, మునిసిప‌ల్ అధికారుల‌కు తెలిసినా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

నేత‌లే ద‌ళారులుగా దందా..!

వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ న‌గ‌రాల‌కు న‌డిబొడ్డున ఉన్న ఈ చెరువు స్థ‌లాన్ని కొంత‌మంది నేత‌ల స‌హ‌కారంతోనే క‌బ్జాకు గుర‌వుతున్న‌ట్లు ప్రజానీకం నుంచి విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ స్థానిక నేత‌లు ఆక్ర‌మ‌ణ ప‌ర్వానికి తెర‌లేపుతున్నారు. చెరువుకు ఆనుకుని ఉన్న ప్రైవేటు స‌ర్వే నెంబ‌ర్ల ఆధారంగా కొంత‌మంది, చెరువులోనే ప‌ట్టాలు క‌లిగిన ఉన్న వారి భూముల‌కు విస్తీర్ణాన్ని ఎక్కువ‌గా చూపుతూ శిఖం భూముల‌ను కాజేస్తున్న‌ట్లు సమాచారం. ఈ మొత్తం వ్య‌వ‌హారం రాజ‌కీయ నేత‌ల అండ‌దండ‌లు, రెవెన్యూ అధికారుల స‌హ‌కారంతోనే య‌థేచ్ఛ‌గా సాగిపోతోందన్న ఆరోప‌ణ‌లున్నాయి. ముంద‌స్తు ఒప్పందంతోనే కొంత‌మంది నేత‌లు చెరువు భూముల్లో ప్లాట్లుగా చేసేస్తు నిర్మాణాలు చేప‌డుతున్నారు. అయితే ఇలా చ‌దును చేస్తున్న వారిలో 200 గ‌జాల నుంచి 1000 గ‌జాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. కొంత‌మంది మెకానిక్ షెడ్డుల‌ను శిఖం భూముల్లో నెల‌కొల్పారు.

తూతూ మంత్రంగా టౌన్‌ ప్లానింగ్ చ‌ర్య‌లు

శిఖం భూముల్లో అక్ర‌మంగా వంద‌లాది నిర్మాణాలు వెలియ‌గా, తూతు మంత్రంగా ఇటీవ‌ల కూల్చివేత‌లు పూర్తి చేసిన జీడ‌బ్ల్యూఎంసీ అధికారులు చేశాంలేమ‌న్న‌ట్లుగా చేతులు దులుపుకున్నారు. మ‌రికొంత‌మందిక నోటీసులిచ్చాం.. వారి వివ‌ర‌ణ‌కు కోసం ఎదురు చూస్తున్నాం. మ‌రికొన్ని కోర్టు ప‌రిధిలో ఉండ‌టంతో కూల్చివేత‌లు చేప‌ట్ట‌లేక‌పోతున్నామ‌నే వివ‌ర‌ణ జీడ‌బ్ల్యూఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి వివ‌ర‌ణ వినిపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed