- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో YIIRS కాంప్లెక్సు.. పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్న సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్సును నిర్మించేలా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా కొన్ని నియోజకవర్గాల్లో భూసేకరణ పూర్తయింది. అన్నిచోట్లా ఒకే డిజైన్‌లో నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం తొలి విడతగా 28 నియోజకవర్గాల్లో నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా పండుగకు ముందే భూమి పూజ జరగనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం షాద్‌నగర్ దగ్గర శంకుస్థాపన చేయనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గమైన మధిరలో భూమిపూజ చేయనున్నారు. పలువురు మంత్రులు, సలహాదారులు కూడా వేర్వేరు చోట్ల ఈ స్కూళ్ల శంకుస్థాపనలో పాల్గొననున్నారు. పైలట్ ప్రాజెక్టుగా మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్‌నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్‌గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆంథోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో భూమి పూజ జరుగుతున్నది.
స్కూళ్లన్నీ ఒకే గొడుగు కిందకు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్ళన్నీ ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చేలా సమీకృత కాంప్లెక్సులను నిర్మించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.5 వేల కోట్లను కేటాయించింది. అందులో ఒక్కో స్కూలు 20-25 ఎకరాల విస్తీర్ణంలో రూ.26 కోట్లను కేటాయించింది. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్లాస్ రూమ్స్, హాస్టల్స్, మెస్‌లు, లైబ్రరీ, స్టేడియం, ఓపెన్ ఎయిర్ థియేటర్, స్విమ్మింగ్ పూల్... ఇలాంటి అన్ని సదుపాయాలను కల్పించనున్నట్లు డిప్యూటీ సీఎం ఇప్పటికే ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ బిల్డింగులుగా వీటిని నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వంలో హాస్టళ్ళలో నెలకొన్న ఇబ్బందులు, తరగతుల నిర్వహణలో, మౌలిక సౌకర్యాల్లో తలెత్తిన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఆ కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. ఏడు నెలల వ్యవధిలోనే నిర్మాణం మొత్తం పూర్తికావాలని టార్గెట్ పెట్టిన ప్రభుత్వం... వచ్చే ఏడాది దసరా నాటికి తరగతులు ప్రారంభం కావాలని షెడ్యూలు రూపొందించింది.
కులమతాలకతీతంగా స్కూళ్లు..
ప్రస్తుతానికి భూసేకరణ పూర్తయ్యి వివిధ విభాగాల నుంచి అన్ని అనుమతులు లభించిన 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీటి నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్నది. మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు వారివారి నియోజకవర్గాల్లో నిర్మాణం కానున్న స్కూళ్ళకు భూమిపూజ చేయనున్నారు. ప్రపంచంతో పోటీ పడే తీరులో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌పైనా విద్యార్థులకు ఆసక్తి పెంచేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. కులమతాలకు అతీతంగా అన్ని కమ్యూనిటీలకు చెందిన విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదువుకోవడంతో చిన్నతనం నుంచే కనిపించే సామిక, కుల వివక్షకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని డిప్యూటీ సీఎం ఇప్పటికే ప్రకటించారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఆ ప్రాంగణంలోనే రెసిడెన్షియల్ క్వార్టర్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.
12వ తరగతి వరకూ ఒకేచోట..
పైలట్ ప్రాజెక్టులో భాగంగా వీటి నిర్మాణం జరుగుతున్న సమయంలోనే ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో భూసేకరణ పూర్తయ్యి అన్ని విభాగాల నుంచి అనుమతులు తీసుకుంటే అక్కడ కూడా నిర్మాణ ప్రక్రియ మొదలయ్యేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇబ్బందుల్లేకుండా వీటికి అవసరమయ్యే నిధులను రిజర్వు చేసి పెట్టింది ప్రభుత్వం. గత ప్రభుత్వంలో దాదాపు సగానికి పైగా (1023 స్కూళ్ళలో 662) అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, వాటికి గత ప్రభుత్వం అద్దె కూడా కట్టకుండా పెండింగ్‌లో పెట్టిందని పేర్కొన్న డిప్యూటీ సీఎం... ఆ బకాయిలను క్లియర్ చేశామని, భూ సేకరణ పూర్తికాగానే అక్కడ కూడా పర్మినెంటు భవనాల్లోకి షిఫ్ట్ అవుతాయని వివరించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ పేరుతో నిర్మిస్తున్న ఈ భవనాలు విద్యా ప్రమాణాలకే కాక విద్యార్థుల మానవిక వికాసానికి తోడ్పడతాయని, 12వ తరగతి వరకు ఒకే చోట చదువుకునేందుకు వెసులుబాటు లభిస్తుందన్నారు.