ముచ్చటగా మూడో సారి జిల్లాలో ఒక్క సీటే.. అయినా.. మనిషి మారలేదు..

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-09 08:46:58.0  )
ముచ్చటగా మూడో సారి జిల్లాలో ఒక్క సీటే.. అయినా.. మనిషి మారలేదు..
X

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా .. అధికారం పోయినా బీఆర్ఎస్ నాయకులు అహం మాత్రం వీడటం లేదు. ప్రజలు, పార్టీ నాయకులు కోరుకునే కలివిడితనం, హుందాతనం మాత్రం ఇంకా దరిదాపులకు రావడం లేదు. అధికార పార్టీ నాయకుల దందాలు, వర్గ విభేదాల కారణంగా ఖమ్మం జిల్లాలో ముచ్చటగా మూడోసారి కూడా ఒక్క సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ సమిష్టిగా ముందుకు పోయేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయడం లేదని స్పష్టమవుతుంది. నేడు హైదరాబాద్ లో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది నాయకులకు ఆహ్వానం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మారదంటూ పెదవి విరుస్తున్నారు.

దిశ బ్యూరో, ఖమ్మం : ఇంకా మాజీ మంత్రి చెప్పినట్లుగానే.. నేడు జరిగే ఖమ్మం పార్లమెంట్ సన్నాహక సమావేశానికి జిల్లా నుంచి అనేక మందికి ఆహ్వానాలు అందలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడ్డా తమను మొదటినుంచీ విస్మరిస్తున్నారనే అపవాదు పలువురు నాయకుల్లో ఉంది. దానిని నిజం చేస్తూ అధిష్టానం తీరు కూడా అలాగే ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పలువురు నాయకులకు నేడు జరిగే సమావేశానికి ఆహ్వానం అందకపోవడంతో నువ్వు వెళ్తున్నావా? అంటే నువ్వు వెళ్తున్నావా? అంటూ సోమవారం రాత్రి నుంచే ఫోన్లు చేసి ఆరా తీయడం కనిపించింది.

అయితే పార్లమెంట్ పరిధిలోని ఈ సమావేశానికి మాజీ మంత్రి పువ్వాడ చెప్పినట్లుగానే అధిష్టానం వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఖమ్మం కార్పొరేటర్లు, పలువురు నాయకులతో అజయ్ సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులకు మాత్రమే సమాచారం అందించారని, తమకు ఎలాంటి సమాచారం లేదని పలువురు జిల్లా నాయకులు తెలిపారు. పార్లమెంట్ సిట్టింగ్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు సైతం ఈ విషయం మీద అంతగా శ్రద్ధ పెట్టినట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ బరిలో ఎవరు..

ఖమ్మం పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారన్న విషయం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది. సిట్టింగ్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆలోచనలో పడ్డారని, అంత సుముఖంగా లేరని ఓ వాదన వినిపిస్తుంటే.. అనుచరులు మాత్రం నామ బరిలో ఉంటారని అంటున్నారు. మాజీ మంత్రి పువ్వాడ పేరు సైతం వినిపిస్తుంది. తాను ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలుస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అదంతా ఫేక్ అంటూ పువ్వాడ కొట్టిపారేసినా ఆయన అనుచరులు మాత్రం పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. వీరిద్దరి పేర్లతో పాటు మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరు కూడా తెరపైకి వస్తున్నది.

జిల్లా అధ్యక్షుడు లేకున్నా..

ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. ఈ నెల 18న ఆయన ఖమ్మంనకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలో జరిగే నేటి సమావేశం ఆయన లేకుండానే జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం భద్రాచలం ఒక్కటే. దానికి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా తాత మధు ఉండి అభ్యర్థిని గెలిపించుకున్నారు. ప్రస్తుతం ఆయన లేకుండానే ఈ మీటింగ్ జరగడం విశేషం. అయితే తాను 18న హైదరాబాద్ వస్తానని, అప్పటి వరకు సమావేశాన్ని వాయిదా వేయాలని రిక్వెస్ట్ చేసినా.. బీఆర్ఎస్ అధినాయకత్వం ఆయన మాటలను పట్టించుకోకపోవడం గమనార్హం.

Read More..

ఆ జిల్లాలో ఎప్పుడైనా బీఆర్ఎస్‌కు ఒకే సీటు వస్తుంది: కడియం శ్రీహరి

Advertisement

Next Story