ఒక్క రూపాయి విలువ రూ.7,140 కోట్లు.. రుణమాఫీలో BRS గ్యాంబ్లింగ్

by Sathputhe Rajesh |
ఒక్క రూపాయి విలువ రూ.7,140 కోట్లు.. రుణమాఫీలో BRS గ్యాంబ్లింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రుణమాఫీ పథకంలో 14 లక్షల మందికి అన్యాయం జరిగింది. ఇందులో రూపాయి తేడాతో మాఫీ పథకానికి అర్హులు కాని రైతులు తొమ్మిది లక్షల మంది ఉంటే మరో ఐదు లక్షల మంది రైతులకు బ్యాంకు అకౌంట్లు సరిగా లేవని స్కీం డబ్బులు అందలేదు. దీంతో బ్యాంకుల్లో జమ చేసిన సుమారు రూ.7140.49 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖజానాలో వచ్చి పడ్డాయి.

3వ వంతు రైతులకు మొండిచేయి

బీఆర్ఎస్ హయంలో అర్హులైన రైతులకు రుణమాఫీ జరగలేదు. సాంకేతిక కారణాల సాకుతో కొందరికి మొండిచేయి చూపించగా, మరికొంత మందికి లాజిక్ చూపి రుణమాఫీ చేయలేదు. దీంతో అర్హులైన రైతుల్లో 3వ వంతు మందికి ప్రయోజనం కలగలేదు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు 40.66 లక్షల మంది ఉన్నారు. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే స్కీం వర్తిస్తుందని కండీషన్ పెట్టారు. ఫలితంగా 36.68 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. దీనికి గాను రూ.20,141 కోట్లు కావాలని బ్యాంకర్లు లెక్కలు తేల్చారు. కానీ ఐదేండ్ల పాటు అప్పటి ప్రభుత్వం వంతుల వారిగా రుణమాఫీ చేయడంతో కేవలం 23 లక్షల మంది రైతులకు మాత్రమే సాయం అందింది.

రూపాయి తేడాతో రూ.5,740.49 కోట్లు మిగిలింపు

బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు విషయంలో రూపాయి తేడా చూపించి రూ.5,740.49 కోట్లు వెనకేసుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది. రూ.99,999 రుణం తీసుకున్న రైతులకే మాఫీ చేసింది. అదనంగా రూపాయి తీసుకున్న సుమారు 9 లక్షల రైతులకు మొండి చేయి చూపింది. రూపాయి ఎక్కువగా ఉందని సాకు చూపి రుణమాఫీ ఎగ్గొట్టిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.

డీయాక్టివ్ అకౌంట్స్‌ పేరుతో రూ.1400 కోట్లు వెనక్కి

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో సమస్యలు వచ్చాయి. రెగ్యూలర్‌గా బ్యాంక్ అకౌంట్లు ఉపయోగించకపోవడంతో మెజార్టీ రైతుల అకౌంట్లు డీయాక్టివ్ అయ్యాయి. దీంతో ప్రభుత్వం అదే అకౌంట్లలో రుణమాఫీ డబ్బులు జమ చేసింది. అకౌంట్లు పనిచేయడం లేదనే కారణంతో బ్యాంకులు.. ప్రభుత్వం జమ చేసిన సుమారు రూ.1400 కోట్లను వెనక్కి పంపించేశాయి. కానీ అప్పటి ప్రభుత్వం రైతులకు ఈ విషయాన్ని వివరించి, కొత్త అకౌంట్లు ఓపెన్ చేయమనో లేక ఆకౌంట్లు యాక్టివేట్ చేసుకోవాలని చెప్పలేదని అధికార వర్గాల్లో ప్రచారం ఉంది.

బీఆర్ఎస్‌ను ఎటాక్ చేసే ప్లాన్

రుణమాఫీ జరగని రైతుల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయంలో జరిగిన రుణమాఫీ వివరాలను సేకరించే పనిలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పడింది. ఆ వివరాల ఆధారంగా ఆ పార్టీపై ఎటాక్ చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే వాటి వివరాలు సేకరించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తున్నది. 2018–23 కాలంలో రుణమాఫీ ఏ విధంగా జరిగింది? ఎంత మంది రైతులను గుర్తించారు? ఎంత మందికి ప్రయోజనం కలిగింది ? అనే కోణంలో ఆఫీసర్లు ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed