రెండు జిల్లాలకు ఒకే రిజిస్ట్రేషన్ ఆఫీస్.. ప్రజలకు తప్పని తిప్పలు

by Sathputhe Rajesh |
రెండు జిల్లాలకు ఒకే రిజిస్ట్రేషన్ ఆఫీస్.. ప్రజలకు తప్పని తిప్పలు
X

దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో పరిధి ఒక్కటే అత్యంత విచిత్ర పరిస్థితులు ఆ జిల్లాలో కనిపిస్తుంటాయి. అధికారులు సరైన ప్రతిపాదనలు చేయలేకపోయారో లేక రాష్ట్ర ప్రభుత్వానికి వినతులు చేయడంలో విఫలం అవుతున్నారో తెలియదు కానీ రాష్ట్రంలోనే అత్యంత వైవిధ్యమైన పరిస్థితులు ఆ జిల్లాలో నెలకొన్నాయి.

భూపాలపల్లి ధైన్యం ఇది

సిరులనందించే సింగరేణి బొగ్గు ఉత్పత్తి చేసే జిల్లాల్లో ఈ జిల్లా ఒకటి. ఓ వైపున బొగ్గుబావులు, మరో వైపున గోదావరి పరవళ్లు, కీకారణ్యాలు విస్తరించి ఉన్న ఈ జిల్లా పరిస్థితి వైపు తొంగి చూస్తే మాత్రం అయ్యో పాపం అనకమానరు. 11 మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసిన భూపాలపల్లి పరిధిలో మొదట ములుగు జిల్లా కూడా ఉండేది. అయితే చిట్టచివర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితా ములుగుకు అవకాశం కల్పించారు. దీంతో ములుగు ప్రాంతమంతా భూపాలపల్లి నుంచి విడిపోయింది. అయితే భూపాలపల్లిలో మాత్రం ప్రత్యేకంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం లేకపోవడం విచిత్రం. రెండు జిల్లాలకు కలిపి ములుగు కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం సేవలు అందిస్తోంది.

దీంతో భూపాలపల్లి జిల్లాలోని చివరి గ్రామానికి చెందిన వ్యక్తి తమ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిందే. తమ జిల్లా పరిధి భూపాలపల్లే అయినా రిజిస్ట్రేషన్ సేవలకు మాత్రం పొరుగు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రభుత్వం మాత్రం భూపాలపల్లికి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చొరవ చూపడం లేదు. ఏప్రిల్ నెలలో ఉమ్మడి మెదక్, పెద్దపల్లి జిల్లాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయల ఏర్పాటుతో పాటు ప్రాంతాల వికేంద్రీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. అయితే ఈ జీఓల్లో భూపాలపల్లి జిల్లాకు మాత్రం ప్రాతినిథ్యం కల్పించకపోవడం విస్మయం కల్గిస్తోంది. గ్రామీణ ప్రాంతాల మీదుగా ఇరుగు పొరుగు జిల్లాలను కలుపుతూ రహదారులు ఏర్పడడం, కాటారం లాంటి సెంటర్లు అభివృద్ధి చెందుతుండడంతో జిల్లా వ్యాప్తంగా కూడా రియల్ భూం పెరిగిపోయింది. దీంతో కమర్షియల్ ప్లాట్ల క్రయవిక్రయాలు చేసుకోవాలంటే పొరుగు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని స్థానికులు అంటున్నారు.

ఈక్వల్ ఏరియా

ఇకపోతే ఈ జిల్లాలో మరో స్పెషాలిటీ కూడా నెలకొంది. జిల్లా కలెక్టర్ పరిధి ఎంతమేర ఉందో ఆర్డీఓకు కూడా అంతే పరిధి ఉండడం విచిత్రం. నూతన జిల్లాల ఆవిర్భావం సమయంలో పాత తాలుకా కేంద్రమైన మహదేవపూర్‌లో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ కార్యాలయం కాటారంలోనే ఏర్పాటు చేయాలని స్థానికులు, మహదేవపూర్‌లో ఏర్పాటు చేయాలని ఇక్కడి వారు డిమాండ్ చేస్తూ నిరసనలకు పూనుకున్నారు. దీంతో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయడమే మానేసిన సర్కారు ఈ ప్రాంతాన్ని కూడా భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ లోనే కలిపేసింది. దీంతో అప్పటి నుంచి కలెక్టర్ ను కలవాలన్నా, ఆర్డీఓను కలవాలన్న మారుమూల ప్రాంత వాసులు జిల్లా కేంద్రానికే తరలి వెళ్లాల్సిన పరిస్థితి తయారైంది.

అయితే జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉండాలన్న నిబంధన కారణంగా కాటారంలో ఆర్డీఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయక, కాటారం వాసులు అభ్యంతరం వ్యక్తం చేస్త్తున్నారని ఈ సెంటర్‌లోనే ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆందోళనలు చేస్తున్నారని మహదేవపూర్‌లో ఏర్పాటు చేయక అధికారులు భూపాలపల్లిలో విలీనం చేసి చేతులు దులుపుకున్నారు. అయితే జగిత్యాల జిల్లాలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా అధికారులు వ్యవహరిస్తుండడం గమనార్హం. మహాదేవపూర్ పూర్వ మండలానికి ప్రత్యేక ఆర్డీఓ ఆఫీసు ఏర్పాటు చేసినట్టయితే అటు రెవెన్యూ సేవలు ఇటు ప్రోటోకాల్ కోసం అందుబాటులో ఉన్నట్టు అవుతుంది. కానీ ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు ఎవరూ పట్టించుకోకుండా వ్యవహరిస్తుండడం వల్ల సామాన్య జనం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed