గవర్నర్ తిరస్కరించిన బిల్లులపై సర్కార్ కీలక నిర్ణయం.. ఈసారి ఓకే చెప్పక తప్పదా!

by GSrikanth |
గవర్నర్ తిరస్కరించిన బిల్లులపై సర్కార్ కీలక నిర్ణయం.. ఈసారి ఓకే చెప్పక తప్పదా!
X

దిశ, తెలంగాణ బ్యూరో: గవర్నర్ తిరస్కరించిన బిల్లుల కోసం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలిసింది. రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని రాజ్యాంగంలో క్లియర్ గా ఉంది. దీంతో వీలు చూసుకుని అసెంబ్లీని సమావేశ పరచాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. సెక్రటేరియట్ ప్రారంభం తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్ పై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.

రెండోసారి అసెంబ్లీ ముందుకు..

గవర్నర్ తిరస్కరించిన బిల్లులను ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీ లో ప్రవేశ పెట్టాలి. వాటిపై సభ చర్చించి ఆమోదించాలి. ఆ తర్వాతే వాటిని ఆమోదించేందుకు గవర్నర్ వద్దకు పంపాల్సి ఉంటుంది. గవర్నర్ ఆమోదం కోసం రెండోసారి వచ్చిన బిల్లులను ఎలాంటి వివరణ అడగకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఆమోదించాలని రాజ్యాంగంలో ఉంది. దీంతో ప్రభుత్వం తిరస్కరించిన బిల్లులను రెండోసారి రాజ్ భవన్ కు పంపాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.

గవర్నర్ ఎన్నింటిని ఆమోదిస్తారు?

‘వైద్య విద్యా సవరణ’ బిల్లును మాత్రమే ప్రస్తుతం గవర్నర్ తిరస్కరించారు. పాలనా బాధ్యతలు చూసే డీఎంఈ పోస్టు ఉద్యోగ విరమణ వయసును 65కు పెంచుతూ ఈ బిల్లును రూపొందించారు. దీనిపై గవర్నర్ స్పందిస్తూ కేవలం ఆ ఒక్క పోస్టు పదవి విరమణ వయస్సు పెంచడం వల్ల ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. మరో మూడు బిల్లులపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. అందులో ప్రైవేటు వర్సిటీల బిల్లు, మున్సిపాలిటీల్లో మైనార్టీలను కో ఆప్షన్ మెంబర్లుగా నియమించే బిల్లు ఉన్నాయి. వీటిపై ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత అందులో గవర్నర్ ఎన్నింటిని ఆమోదిస్తారు? ఎన్నింటిని తిరస్కరిస్తారు? అనే టెన్షన్ ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

ఢిల్లీ టూర్ తర్వాత సెషన్ పై క్లారిటీ

ఈనెల 30న కొత్త సెక్రటేరియట్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ బిజీ షెడ్యూలు ఉంది. మే 2న ఢిల్లీకి వెళ్లి 4న అక్కడ కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నారు. ఆ ఆ తర్వాత అక్కడే రెండు, మూడు రోజుల పాటు ఉంటారని తెలిసింది. ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన తర్వాత అసెంబ్లీ సెషన్ పై క్లారిటీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Next Story