BJP మాస్టర్ ప్లాన్.. మరోసారి తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు!

by GSrikanth |
BJP మాస్టర్ ప్లాన్.. మరోసారి తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్ ఫలితాలతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్‌ను గద్దెదించి అధికారంలోకి వస్తామని సవాల్ చేస్తున్న కమలనాధులు తమ తదుపరి టార్గెట్ తెలంగాణే అని పదే పదే చెప్పడం సంచలనం అవుతోంది. దీంతో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆశలకు బీజేపీ గండికొట్టే ప్రణాళికలు గట్టిగానే చేస్తోంది. ఈ క్రమంలో ఏ మాత్రం ఛాన్స్ దొరికినా తెలంగాణలో వాలిపోతున్న బీజేపీ పెద్దలు ఇక్కడ రాజకీయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలు సార్లు రాష్ట్రానికి వచ్చి వెళుతున్న బీజేపీ పెద్దలు తాజాగా మరోసారి హైదరాబాద్ వేదికగా కీలక సమావేశం నిర్వహించబోతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

మరోసారి హైదరాబాద్‌కు బీజేపీ అగ్రనేతలు:

రాష్ట్రంలో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఢీ అంటే ఢీ అనే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న బీజేపీ అగ్రనేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని కుండబద్దలు కొడుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నిర్వహించబోయే మరో కీలక సమావేశానికి హైదరాబాద్ వేదికగా మారబోతోంది. గుజరాత్‌లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ ఇక సౌత్ స్టేట్స్ పై ఫోకస్ పెట్టింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా డిసెంబర్ 28,29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గ విస్తారక్ (పూర్తి స్థాయి కార్యకర్తలు)ల శిక్షణ సదస్సు నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమంలో దక్షిణాదిలో 80 లోక్ సభ నియోజకవర్గాల విస్తారక్ లు పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ సదస్సుకు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ బీజేపీ వ్యవహరాల ఇన్ చార్జి తరుణ్ ఛుగ్, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్ తదితరులు హాజరు కాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాలు చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేసుకుంటున్న సమయంలో బీజేపీ అగ్రనాయకత్వమంతా హైదరాబాద్ కు రానుండటం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతోంది. రెండు రోజుల పాటు నగరంలోనే మకాం వేసి రాబోయే ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

కేసీఆర్ ను మరింత ఇరుకున పెట్టేలా వ్యూహాం:

గత కొంత కాలంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సై అంటే సై అంటున్న కేసీఆర్ ను రాష్ట్రంలో మరింత ఇరుకున పెట్టేలా బీజేపీ వ్యవహరించబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ స్టేట్ చీఫ్ నిత్యం కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిరోజు గళం విప్పుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతిపై బీజేపీ మరింత ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా ఏడాది కాలం సమయం ఉంది. ఇంకాస్త సమయం ఇస్తే బీజేపీ పుంజుకోవడం ఖాయం అనే అంచనాలు ఉన్నాయని, అందువల్ల వీలైనంత వేగంగా ముందుస్తుపై నిర్ణయం తీసుకునే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. కేసీఆర్ ముందుస్తుకు వెళ్లడం ఖాయం అని ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ సైతం బలంగా నమ్ముతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యూహాలను చిత్తుచేసేలా బీజేపీ అగ్రనాయకత్వం మరింత స్పీడ్ పెంచబోతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీఎల్ సంతోష్ పేరు చర్చనీయాంశంగా మారింది. విచారణకు రావాలని ఆయనకు సిట్ జారీ చేసిన నోటీసులపై హైకోర్టు స్టే విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో బీఎల్ సంతోష్ రాష్ట్రానికి రాబోతున్నాడనే ప్రచారం సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది.

Advertisement

Next Story

Most Viewed