ప్రొటోకాల్ ఇష్యూపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన తమిళి సై

by Satheesh |   ( Updated:2024-05-01 15:38:19.0  )
ప్రొటోకాల్ ఇష్యూపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన తమిళి సై
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడూ ప్రొటోకాల్ పాటించలేదని బీజేపీ తెలంగాణ స్టార్ క్యాంపెయినర్ తమిళి సై అన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో ఆమె మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలతో ఎక్కువగా లబ్ధి చేకూరాలంటే లోక్ సభ ఎన్నికల్లో మోడీని గెలిపించాలని కోరారు. తెలంగాణ ప్రజలతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని, ఆ అనుబంధం ఇంకా పటిష్టంగా మారిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు చాలా ప్రేమ కలిగిన వారని తమిళి సై కొనియాడారు. తనను ఒక సోదరిలా చూసుకున్నారని గుర్తుచేసుకున్నారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఆమె జోస్యం చెప్పారు.

రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్.. బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని తమిళి సై విమర్శలు చేశారు. ఇకపోతే రాజ్యాంగం మార్చే ఉద్దేశ్యం లేదని స్వయంగా ప్రధాని మోడీ చెప్పారని, తానే రక్షగా ఉంటానని అన్నారని తెలిపారు. నేషనల్ ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడమే దీనికి నిదర్శనంగా ఆమె చెప్పుకొచ్చారు. దీనికి చైర్మన్‌గా ఆరుసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి ఉన్నారని వివరించారు. తమిళనాడులో బీజేపీ కచ్చితంగా మంచి ఫలితాలు సాధిస్తుందని, తాను ఈసారి చెన్నై సౌత్ నుంచి విజయం సాధిస్తానని జోస్యం చెప్పారు. తెలంగాణలో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తామని పేర్కొన్నారు. ఎక్కువ సీట్లు గెలుచుకునేలా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు ఆమె స్పష్టంచేశారు. ఈ ఎన్నికలు ప్రధాని కోసం జరుగుతున్నాయని, ప్రజలు ఇప్పటికే ఎవరికి ఓటేయాలో డిసైడయ్యారని తమిళి సై తెలిపారు. ప్రతి కుటుంబంలో ఒకరు కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారు ఉంటారని, ఈ అంశమే తమకు బలంగా మారుతుందని వివరించారు.

Advertisement

Next Story