సాయంత్రం వరకు సస్పెన్స్​!! KCR​ ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ..!

by Nagaya |   ( Updated:2023-01-18 02:33:08.0  )
సాయంత్రం వరకు సస్పెన్స్​!! KCR​ ప్రసంగంపై తీవ్ర ఉత్కంఠ..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఆవిర్భావసభను బుధవారం ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్తయ్యాయి. తెలంగాణతో పాటు ఏపీ నుంచి సైతం ప్రజలు సభకు హాజరుకానున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగంపై సస్పెన్స్ నెలకొంది. ఆయన ఏం మాట్లాడతారనే ఉత్కంఠ ఆ పార్టీ నేతలతో పాటు రాజకీయంగా వర్గాల్లోనూ నెలకొంది. పార్టీ విధివిధానాలను ప్రకటిస్తారా? లేక రాజకీయ విమర్శలకే పరిమితమవుతారా? అనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో కేసీఆర్ ఇచ్చే సందేశం గతంతో పోలిస్తే కొత్తగా ఉంటుందని ఆ పార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పాల్గొననున్నారు. తెలంగాణ, ఏపీ ప్రజలను ఆకట్టుకునేలా కేసీఆర్ ఆయన ప్రసంగం ఉంటుందని, దీంతో బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ మరింత పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రాజకీయాల కోసం టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఆ పార్టీ ఎజెండాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ వేదికగా ఎజెండా, ఆర్థిక విధానాలు, వ్యవసాయ రంగంపై పాలసీ, విద్యా, వైద్య రంగాలు, ప్రపంచపోటీని తట్టుకునేందుకు పారిశ్రామిక రంగంలో కొత్త ఆలోచనలు, విదేశాంగ విధానాలపై కేసీఆర్ ఏం చెబుతారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా సాగునీటి వాటాల విషయంలో ఆయా రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. వాటిని పరిష్కరించేందుకు ఏమైనా పాలసీని ప్రకటిస్తారా? లేదా? చూడాలి.

మద్దతు ఉందని సంకేతాలు..

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఖమ్మంలో గులాబీ పార్టీకి పెద్దగా పట్టు లేదు. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలపొందాలనే ఆలోచనతోనే ఆయన ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో బీజేపీకి పట్టు పెరగడం, మరోవైపు టీడీపీ బలోపేతంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఈ సభలో రాజకీయ విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే చాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాల సమాచారం. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరిని కాదని, ఆ పార్టీకి లెఫ్ట్, ఆఫ్ పార్టీల మద్దుతు ఉందనే ఈ సభ ద్వారా కేసీఆర్ సంకేతం ఇవ్వనున్నట్టు టాక్.

ఏపీ వివాదాలపై ఎలా?

రాష్ట్ర విభజన నుంచి ఏపీతో అనేక విషయాల్లో తెలంగాణకు వివాదాలు కొనసాగుతున్నాయి. విభజన చట్టంలోని 8, 9 షెడ్యూల్లోని పలు సంస్థల విభజన ఇంకా పెండింగ్ లోనే ఉంది. సుమారు రు.6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ చెల్లించడం లేదని ఏపీ కోర్టుకు వెళ్లింది. గతంలో పొలవరం ప్రాజెక్టు ఎత్తుపై తెలంగాణ మంత్రులు అభ్యంతరం తెలిపారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపైనా కోర్టులో కేసులు వేశారు. ఇప్పుడు ఈ అంశాలపై కేసీఆర్ ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ విస్తరణ కోసం కేసీఆర్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని సైతం ప్రకటించారు. మరి సభా వేదికగా వీటి గురించి కేసీఆర్ ఏం మాట్లాడతారు? మూడు రాజధానుల విషయంలో బీఆర్ఎస్ విధానం ఎలా ఉండబోతున్నది అనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read....

నిలువెత్తు రూపం... నినదించిన గళం...

Advertisement

Next Story

Most Viewed