G. Kishan Reddy : అధ్యక్ష పదవికి ఓకే.. ప్రధాని టూర్ తర్వాత బాధ్యతలు

by Rajesh |   ( Updated:2023-07-05 09:35:41.0  )
G. Kishan Reddy : అధ్యక్ష పదవికి ఓకే.. ప్రధాని టూర్ తర్వాత బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పార్టీ అవసరాల కోసం చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా అధ్యక్ష పదవిని స్వీకరించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. వరంగల్‌ టౌన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల నిమిత్తం ఈ నెల 8న ప్రధాని మోడీ రానున్నారని, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టేట్ చీఫ్ బాధ్యతలను స్వీకరిస్తానని ఢిల్లీలో మీడియాకు స్పష్టత ఇచ్చారు.

కేంద్ర మంత్రి పదవిని వదులుకోవడం అనివార్యమనే అభిప్రాయాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావించారు. కేవలం తెలంగాణ కోసం చేసిన మార్పులు కాకుండా పలు రాష్ట్రాల్లోనూ పార్టీపరంగా సంస్థాగతమైన మార్పులు చేసినందువల్ల కేంద్ర మంత్రిగానూ కొనసాగే ప్రత్యేక మినహాయింపు ఉండకపోవచ్చన్న అభిప్రాయాన్ని పరోక్షంగా పేర్కొన్నారు. ప్రధాని వరంగల్ టూర్‌ను పురస్కరించుకుని ఏర్పాట్లపై చర్చించడానికి బుధవారం సాయంత్రమే ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నారు.

రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలన చేపట్టే ముందు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులను ఢిల్లీలోనే కలిసే అవకాశమున్నది. పార్టీ విధానం ప్రకారమే ఒకరికి ఒక పదవి మాత్రమే అనే నిబంధన అమలవుతున్నందున రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ కేంద్ర మంత్రిగానూ కొనసాగే అవకాశం లేదన్న భావనతో ఉన్నారు.

హైదరాబాద్ చేరుకున్న తర్వాత పార్టీ నేతలతో పార్టీ ఆఫీస్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత గురువారం ఉదయం వరంగల్ వెళ్ళనున్నారు. మోడీ పర్యటన పూర్తయ్యేంత వరకూ ఆ పనుల్లోనే ఆయన నిమగ్నం కానున్నారు. మరోవైపు కేంద్ర క్యాబినెట్‌లో మార్పులు చేర్పులకు మరో వారం రోజులు పట్టే అవకాశమున్నది.

ప్రస్తుతం రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల టూర్‌లో ఉన్నందున ఆమె అందుబాటులో లేని సమయంలో మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం లేదు. ఆ తర్వాత ప్రధాని రెండు రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ప్రోగ్రామ్ ఫిక్స్ అయినందున 9వ తేదీ వరకు వీలు పడదు.

ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఈ మార్పులు చేర్పులు జరిగే అవకాశమున్నది. ఈ నెల 13 నుంచి ప్రధాని విదేశీ పర్యటన ఉన్నందున ఆ లోపే కేంద్ర క్యాబినెట్ పునర్‌వ్యవస్థీకరణ జరగడానికి షవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందులో భాగంగానే అప్పటివరకూ కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే సమయంలో కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేయనున్నారు.

Advertisement

Next Story