ఔటర్ పరిధిలో చెరువుల కబ్జాలు.. లెక్కలు తీస్తున్న అధికారులు

by karthikeya |   ( Updated:2024-10-08 03:47:22.0  )
ఔటర్ పరిధిలో చెరువుల కబ్జాలు.. లెక్కలు తీస్తున్న అధికారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కబ్జాకు గురైన చెరువుల లెక్కలను అధికారులు వెలికితీస్తున్నారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ వస్తున్న హైడ్రా.. ఇంకా ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి..? ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయి..? అనే వివరాలను సేకరిస్తున్నది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో 2014కు ముందు 920 చెరువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిలో అప్పటికే 225 చెరువులు కబ్జాకు గురయ్యాయి. 196 చెరువులు పాక్షికంగా ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. 2014 తర్వాత 695 చెరువులు ఉండగా.. ఈ పదేళ్ల కాలంలో 171 చెరువులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటిలో నుంచి 44 చెరువులు పూర్తిగా పూర్తిగా మాయం అయ్యాయి. 127 చెరువులు పాక్షికంగా కబ్జా గురయ్యాయి. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే అత్యధికంగా చెరువులు కబ్జాకు చేసినట్లు గుర్తించారు.

ఆ చెరువులను పూర్తిగా మింగేశారు..

- ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల్లోని 2014 నుంచి 2023 వరకు 20 చెరువులను పూర్తిగా కబ్జా చేశారు.

- హైదరాబాద్ జిల్లా షేక్‌పేట్‌లోని 2.21ఎకరాల చెరువును పూర్తిగా మింగేశారు.

- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని చెరువు 2014 కంటే ముందు 1.62 ఎకరాల్లో విస్తరించి ఉంది. కానీ.. 2023 వరకు పూర్తిగా ఆక్రమణకు గురైంది.

- గండిపేట్ మండలంలోని పుప్పాలగుడ గ్రామంలో 9.25 ఎకరాల చెరువులో పూర్తిగా నిర్మాణాలు వెలిశాయి.

- రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లోని 6.39 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. కాలువలను మూసేసి నిర్మాణాలు చేపట్టారు.

- బాలాపూర్ మండలంలోని మామిడిపల్లి గ్రామంలోని మర్రివాణికుంట 3.18 ఎకరాల చెరువును కబ్జా చేశారు. చెరువు అనేదే కనిపించకుండా చేశారు.

- గండిపేట మండలం పీరం చెరువు గ్రామంలోని పితురుకుంట చెరువు 1.16 ఎకరాల్లో విస్తరించి ఉంది. కానీ ప్రస్తుతం దాని నామరూపాల్లేకుండా చేశారు.

- గండిపేట్ మండలం అల్జాపూర్ గ్రామంలోని 2.02 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది.

- మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని అల్వాల్ గ్రామంలోని చెరువు 2014లో 1.33 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2023 వరకు చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది. అన్ని నిర్మాణాలు వెలిశాయి.

- అల్వాల్‌లోనే మరో 1.30 ఎకరాల విస్తీర్ణంగల చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది.

- కేపీహెచ్‌బీ కాలనీలోని 1.07 ఎకరాల చెరువును సైతం మాయం చేశారు.

- మేడిపల్లి మండలం బోడుప్పల్‌లోని 1.32 ఎకరాల చెరువులో పూర్తిగా నిర్మాణాలు వెలిశాయి. దీంతో చెరువు అనవాళ్లు లేకుండా పోయాయి.

- కీసర మండలంలోని రాంపల్లిలో గల 39 గుంటల చెరువును కూడా కబ్జా చేశారు.

- మేడ్చల్ మండలంలోని గుండ్లపోచంపల్లి గ్రామంలోని 2.27 ఎకరాల చెరువును కబ్జా చేసి పూర్తిగా నిర్మాణాలు చేపట్టారు.

- ఉప్పల్ భగాయత్‌లోని 3.11ఎకరాల చెరువును పూడ్చేసి పూర్తిగా నిర్మాణాలు చేపట్టారు.

- బాచుపల్లిలోని 2.10 ఎకరాల చెరువు పూర్తిగా ఆక్రమణకు గురైంది. చెరువు గర్భంలోనే నిర్మాణాలు చేపట్టారు.

- ఉప్పల్ మండలంలోని మల్లాపూర్‌లోని 3.12 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది.

- కీసర మండలం రాంపల్లిలోని 2.16 ఎకరాల చెరువును పూర్తిగా కబ్జా చేశారు.

- సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి‌పేట గ్రామ 2.09 ఎకరాల చెరువులను పూర్తిగా మింగేశారు.

- కిష్టారెడ్డి‌పేట్‌లోని 23 గుంటల విస్తీర్ణం ఉన్న చెరువును సైతం పూర్తిగా కబ్జా చేశారు.

అప్పుడు సగమే.. ప్రస్తుతం పూర్తిగా...

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని 2014 వరకు పాక్షికంగా కబ్జాకు గురైన చెరువులు 2023 వరకు పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్ జిల్లా బహుదురుపురలోని 3.15 ఎకరాలు చెరువు 2014లో 1.31 ఎకరాలు మాత్రమే కబ్జాకు గురైంది. ప్రస్తుతం పూర్తిగా కబ్జా అయింది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం పుప్పాలగుడ గ్రామంలోని బ్రహ్మణకుంట చెరువు 6.28 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. 2014లో 1.6 ఎకరాలను మాయం చేసిన కబ్జాకోరులు 2023 వరకు పూర్తిగా మింగేశారు. బాలాపూర్ మండలం బడంగ్‌పేట్ చెరువును సైతం పూర్తిగా కబ్జా చేశారు. శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి చెరువు 2.16 ఎకరాలు, పుప్పాలగుడలోని 20.08 ఎకరాల చెరువు, గండిపేట మండలంలోని నార్సింగిలోని 4.17ఎకరాలు, రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో 1.6 ఎకరాలు, బండ్లగుడ జాగీర్‌లో 3.38 ఎకరాలు, బాలాపూర్ మండలంలోని కుర్మల్ గుడ 3.09 ఎకరాల చెరువు, హయత్‌నగర్ మండలంలోని బాగ్‌హయత్‌నగర్‌లో 2.07 ఎకరాల చెరువు పూర్తిగా కబ్జాకు గురైంది.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో పరిస్థితి ఇలా..

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని కీసర మండలం నాగారం గ్రామంలో గల వడ్డేరువాణికుంట చెరువు విస్తీర్ణం 10,13 ఎకరాలు. 2014లో ఈ చెరువు 2.40 ఎకరాలు కబ్జాకు గురైంది. ప్రస్తుతం దీన్ని పూర్తిగా ఆక్రమించారు. బోడుప్పల్ చెరువు 3.27 ఎకరాలు, అల్వాల్ మండలం మచ్చబొల్లారం చెరువు 1.12 ఎకరాలు, బాచుపల్లిలో 2.36 ఎకరాలు, బోడుప్పల్లో 17.24 ఎకరాలు, కీసర మండలంలోని నాగారంలో 4.13 ఎకరాల చెరువు, మేడ్చల్ మండలం గౌడవెల్లిలో 3.17 ఎకరాలు, కూకట్‌పల్లి మండలంలోని అల్లాపూర్‌లో 1.28 ఎకరాలు, దుండిగల్ మండలంలోని బహదుర్పల్లిలో 6.09 ఎకరాల చెరువు, బాలానగర్ మండలంలోని ఫతేనగర్ చెరువు 1.30 ఎకరాల చెరువును పూర్తిగా మింగేశారు.

సంగారెడ్డి జిల్లాలో...

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం కిష్టారెడ్డి‌పేట్‌లోని 1.08 ఎకరాల చెరువు, పటాన్ చెరులోని 3.37 ఎకరాల చెరువును కబ్జాదారులు నామరూపాల్లేకుండా చేశారు.

Advertisement

Next Story