తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్.. రెడ్ జోన్‌లోనే రాష్ట్రంలోని సగం జిల్లాలు..!

by Satheesh |
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్.. రెడ్ జోన్‌లోనే రాష్ట్రంలోని సగం జిల్లాలు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: మే నెలలో ఎండలు మాడు మండేలా కాస్తున్నాయి. ఏప్రిల్ మాసం నుండి మేలో అడుగిడిన మొదటి రోజే ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో రాష్టంలోని దాదాపు సగం జిల్లాలు వేడిమితో అట్టుడుకుతున్నాయి. నల్గొండ జిల్లా గుడాపూర్‌లో బుధవారం అత్యధికంగా 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్టంలో మొత్తంగా 11 జిలాల్లో 46 డిగ్రీలు నమోదుకావడంతో వాతావరణ శాఖ రెడ్ జోన్ ప్రకటించింది. ఇక 9 జిల్లాలో 45 డిగ్రీలు నమోదు కాగా, మిగిలిన 13 జిల్లాలో 44 నుండి 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఈ ఉష్ణోగ్రతలు మంగళవారం కంటే అధికంగా నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉష్ణోగ్రతలు గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 22 డిగ్రీల అధికంగా నమోదమయ్యంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుండటంతో ఎండల ధాటికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. నిప్పుల కుంపటిలా వాతావరణం మారుతుంది. విపరీతమైన ఉక్కపోత, చెమటతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఉత్తర తెలంగాణలో ఎండ తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. అయితే మరో నాలుగు రోజులపాటు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు.. తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వడగాలులు తప్పవని, ఎండల తీవ్రత కూడా పెరిగే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్‌లో పెరిగిన ఎండతీవ్రత నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Next Story