మూసీ మార్కింగ్.. అధికారులు తప్పు చేశారా..?

by karthikeya |
మూసీ మార్కింగ్.. అధికారులు తప్పు చేశారా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పరివాహక ప్రాంతంలోని నివాసితులను డీల్ చేసే విషయంలో అధికారులు ప్లానింగ్ లేకుండా వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా ప్రజలకు అవగాహన కల్పించకుండా, ఏకంగా ఇండ్లకు రెడ్ మార్క్ వేయడం వల్లే గందరగోళ పరిస్థితులు తలెత్తాయనే అభిప్రాయాలు నెలకొన్నాయి. సర్వే చేసిన తర్వాత, స్థానికులతో ఆఫీసర్లు సంప్రదింపులు జరపలేదని, కొంత సమయం ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. కొందరు ఆఫీసర్ల దూకుడు వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందనే చర్చ ఆఫీసర్లు, రూలింగ్ పార్టీ లీడర్ల మధ్య జరుగుతున్నది.

ఐఏఎస్‌ల వల్లే చెడ్డపేరు!

మూసీ నదిలో, నదిచుట్టూ ఉన్న ఇండ్లను గుర్తించి, అక్కడి నివాసితులను తరలించే బాధ్యత మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. ఆ రెండు శాఖలకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లు సరిగా వ్యవహరించకపోవడం వల్లే వివాదాలు తలెత్తాయని ఆరోపణలు వస్తున్నాయి. ముందుగా ఖాళీ చేయించాల్సిన ఇండ్లను గుర్తించే ప్రక్రియలోనే పొరపాటు చేశారని, ఉన్నఫళంగా ఇండ్లకు రెడ్ మార్క్ వేయడం వల్లే ఈ సమస్య వచ్చిందనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ‘‘ముందుగా స్థానికులతో సమావేశాలు నిర్వహించాలి. రెండు మూడు సార్లు సంప్రదింపులు జరపాలి. ఒప్పుకోని బాధితులను బుజ్జగించాలి. అందుకోసం స్థానిక లీడర్ల సహకారం తీసుకోవాలి. అలాగే ఇండ్లను ఖాళీ చేస్తే ప్రత్యామ్నయంగా ప్రభుత్వం ఇచ్చే ఇండ్లు, ఉపాధి కార్యక్రమాలను వివరించాలి.’’ అని కానీ, ఇవేమి చేయకుండా ఏకంగా రెడ్ మార్క్ వేయడం వల్లే ఈ సమస్య వచ్చిందని రూలింగ్ పార్టీ లీడర్లు ,సీనియర్ ఐఏఎస్‌లు అభిప్రాయపడుతున్నారు.

మూసీ సుందరీకరణ వేరు.. హైడ్రా వేరు..

వేర్వేరు కార్యక్రమాలైన మూసీ సుందరీకరణ, హైడ్రా యాక్టివిటీ ఒకేసారి మొదలుపెట్టడం వల్లే ప్రజల్లో ఆందోళన నెలకొందని కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుకుంటున్నారు. ఓ వైపు హైడ్రా కూల్చివేతలపై విమర్శలు, న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్న సమయంలో మూసీ సుందరీకరణ ఎపిసోడ్‌ను తెరమీదికి తెచ్చి తప్పు చేశారని విమర్శిస్తున్నారు. మూసీలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయించేందుకు మార్కింగ్ చేసే ప్రక్రియను కొంత కాలం తర్వాత మొదలు పెట్టి ఉండాల్సిందని అంటున్నారు. ఓ కొత్త కార్యక్రమం చేపడుతున్నప్పుడు తలెత్తే పర్యవసనాలను అంచనా వేయడంలో ఆఫీసర్లు ఫెయిల్ అయ్యారని టాక్ ఉంది. అలాగే కొందరు అధికారులకు మీడియాలో కనిపించాలనే ఉన్న తపన కూడా ప్రభుత్వానికి నెగెటివ్ టాక్ తెచ్చిపెట్టిందని అభ్యంతరాలు వినిపిస్తున్నాయి.

Next Story