కొత్త ఆర్వోఆర్ చట్టంతో రాజ్యాంగ ఉల్లంఘన..? డ్రాఫ్ట్ బిల్లుపై ‘ఐఏఎస్’ల అభ్యంతరం!

by Mahesh |   ( Updated:2024-11-08 02:45:00.0  )
కొత్త ఆర్వోఆర్ చట్టంతో రాజ్యాంగ ఉల్లంఘన..? డ్రాఫ్ట్ బిల్లుపై ‘ఐఏఎస్’ల అభ్యంతరం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ధరణి పోర్టల్ వల్ల ఎన్నో ఏళ్లుగా లక్షలాది మంది రైతులు ముప్పు తిప్పలు పడ్డారు. వీరి బాధలను స్వయంగా చూసిన కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల సమయంలో కొత్త రెవెన్యూ చట్టం, ధరణి స్థానంలో భూమాతను తీసుకువస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చేందుకు అడుగులు వేశారు. ఆర్వోఆర్-2024 డ్రాఫ్ట్ బిల్లును పబ్లిక్ డొమెయిన్ లో పెట్టి, సదస్సులు నిర్వహించి అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించారు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన రివ్యూ మీటింగ్‌లో కొందరు ఐఏఎస్ అధికారులు డ్రాఫ్ట్ బిల్లుపై కొత్త అనుమానాలు రేకెత్తించి నట్లు తెలిసింది. ఆర్వోఆర్-2020 స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు రావాలంటే రాష్ట్రపతి ఆమోదం కావాలని చెప్పినట్లు సమాచారం.

రాజ్యాంగ, చట్ట ఉల్లంఘనలు జరుగుతాయని, ఎవరైనా కేసు వేస్తే చట్టాన్ని కొట్టివేస్తారంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇంకా చాలా అభ్యంతరాలను సీఎం ఎదుట లేవనెత్తినట్టు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో ఆర్వోఆర్ -2020, ధరణి పోర్టల్ అమలులోకి తెచ్చినప్పుడు అడ్డురాని అంశాలన్నీ ఇప్పుడు ప్రస్తావిస్తున్నట్టు తెలిసింది. అయితే కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అడ్డుకునేందుకే కొందరు ఐఏఎస్ అధికారులు కావాలనే కొత్త కొత్త అంశాలు తెరమీదికి తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఆర్వోఆర్-2020 రూపకల్పనలో కేసీఆర్ వెన్నంటి ఉండి కీలక భూమిక పోషించిన కొందరు ఐఏఎస్ అధికారులు ఇప్పుడు కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అడ్డుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డ్రాఫ్ట్ స్టడీ చేయలేదా?

ప్రజాభిప్రాయ సేకరణ ద్వారానే కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో పదిహేనేండ్ల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఆర్వోఆర్-2024 డ్రాఫ్ట్ ను పబ్లిక్ డొమెయిన్ లో ఉంచారు. ఆ తర్వాత ఎన్నో అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. రెవెన్యూ, భూ పరిపాలన మీద ఇరవై ఏండ్ల అనుభవం తమకుందని చెప్పుకున్న కొందరు ఐఏఎస్ అధికారులు అప్పుడు మౌనం వహించారు. ప్రతి జిల్లాలో సదస్సులు పెట్టి చట్టాన్ని వివరించారు. ఇప్పుడు ఫైనల్ చేసే సమయంలో సీఎం రివ్యూ పెట్టగానే కొత్త అనుమానాలను రేకెత్తించారు. చట్టం అమలు కావాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి అని, ఎవరైనా కోర్టుకు వెళితే రద్దవుతుందంటూ చెప్పారు.

అయితే కేసీఆర్ హయాంలో రిజిస్ట్రేషన్ల బాధ్యతలను తహశీల్దార్లకు అప్పగించారు. ఆయన దగ్గర కీలక పాత్ర పోషిస్తూ, అత్యంత కీ పోస్టుల్లో పని చేసిన ఆ ఐఏఎస్ అధికారులు అప్పుడు చట్ట ఉల్లంఘన అవుతుందని, రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని ఎందుకు చెప్పలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫైనల్ అప్రూవ్ స్టేజ్ లో అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ చట్టం అమలుకు అనేక ఇబ్బందులు ఉన్నాయని గుర్తు చేయడం వెనుక ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఆయనే సీఎంవోలో పనిచేస్తున్న కొందరు అధికారులకు ఈ చట్టం అమలు కాకుండా, కాలయాపన చేసేలా కుంటిసాకులను తెర మీదికి తీసుకు వస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్లు చెల్లవా?

రాష్ట్రపతి ఆమోదం లేకుండా అమలు చేసిన ఆర్వోఆర్-2020, ధరణి పోర్టల్, రిజిస్ట్రేషన్లు.. వీటి ద్వారా జరిగిన క్రయ విక్రయాలు, చేర్పులు/మార్పులు, ఎన్వోసీలు, కొత్త పాసు పుస్తకాల జారీ వంటివి చెల్లవా? ఈ ఐదేండ్ల ట్రాన్సక్షన్స్ కోర్టుకు వెళ్తే రద్దు చేస్తారా? ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతే చేయాలని 20 ఏండ్ల అనుభవం కలిగిన అధికారులు ఎందుకు కేసీఆర్ చెప్పలేదో వారే సమాధానం చెప్పాలి.

పేరు మార్చాలని..

ఆర్వోఆర్ చట్టాల్లో పోర్టల్ పేరును ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఆర్వోఆర్- 2020లో ధరణి పోర్టల్ అని పేర్కొన్నారు. అయితే ధరణి స్థానంలో భూ మాత పోర్టల్ ను తీసుకురావాలన్నా చట్టం చేసుకోవాల్సిందే. మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ వంటి వారే ధరణి పోర్టల్, ఆర్వోఆర్-2020లో అనేక మార్పులు తీసుకురావాలని సూచిస్తున్నారు. కాకపోతే సవరణలు చేయాలన్న డిమాండ్ చేస్తున్నారు. వారు కూడా అప్పీల్ వ్యవస్థ ఉండాల్సిందే అంటున్నారు. సీఎంవోలోని కొందరు ఐఏఎస్ అధికారులు ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రోద్భలంతో ఈ చట్టమే అవసరం లేదన్న భావనను సృష్టిస్తున్నారు. ధరణి పోర్టల్ లో అంతా బాగుందని చూపిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది తప్పిదాల వల్ల పట్టా భూమిని ప్రభుత్వ భూమి గా నమోదు చేస్తే.. తిరిగి మార్చుకోవడానికి జర్నలిస్టుగా ఉన్న వారికే 14 నెలల సమయం పట్టింది. ఇలాంటి క్షేత్ర స్థాయి అనుభవాలను అధ్యయనం చేయని కొందరు అధికారులు చట్టంలో మార్పులను జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది.

‘సాదాబైనామాల’పై సమాధానమేంటి?

గత ప్రభుత్వం 2020 అక్టోబరులో జీవో 112 ద్వారా సాదాబైనామాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించింది. 2020 అక్టోబరు 10 నుంచి 29 తేదీ వరకు 2,26,693 దరఖాస్తులు వచ్చాయి. ఆ తర్వాత ఆర్వోఆర్-2020 ని అమల్లోకి వచ్చింది. అందులో సాదాబైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం లేదు. అయినా అది అమల్లోకి వచ్చిన తర్వాత 2020 అక్టోబరు 29 వరకు 6,74,201 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 9 లక్షల వరకు వచ్చాయి. మరి ఆ రోజుల్లో సాదాబైనామాలు చేయొద్దని అప్పటి సీఎం కేసీఆర్ కు ఆయన పేషీలోనే పని చేసిన ఐఏఎస్ అధికారులు చెప్పలేదు. ఇప్పుడేమో వాటిని పరిష్కరించొద్దని, అవసరమైతే రిజిస్ట్రేషన్లు చేసుకుంటారని సలహాలు ఇస్తున్నారు. ఐదేండ్ల తర్వాత అప్లికేషన్లు పరిష్కరించకుండా పెండింగ్ పెట్టి, చేతులెత్తేస్తే 9 లక్షల కుటుంబాలకు ఏం సమాధానం చెప్తారు? వాటిలో సరైనవి ఏమిటో పరిశీలించేందుకు అవసరమైన గైడ్ లైన్స్ రూపొందించకుండా.. ఆ పెండింగ్ ఫైల్స్ ని పరిశీలించకుండా కొత్త చట్టాన్ని రూపొందిస్తే రేవంత్ రెడ్డి సర్కారును ఇబ్బంది పెట్టినట్లే అవుతుంది. అయితే ఈ అంశంలో పెండింగ్ అప్లికేషన్ల వరకు పరిష్కరించాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే అప్పుడేమో ఈ విధానాన్ని అమలు చేయొద్దని చెప్పాల్సిన అధికారులు సైలెంట్ గా ఉన్నారు. వారే ఇప్పుడు ఆ అప్లికేషన్ల పరిష్కారాన్ని అడ్డుకుంటుండడం గమనార్హం.

అప్పుడు వీటిపై మౌనం?

– ఆర్వోఆర్ 2020లో అప్పీల్ వ్యవస్థ లేకుండా చేసినప్పుడు రాజ్యాంగ ఉల్లంఘన అని గుర్తు చేయని అధికారులు.

– రెవెన్యూ కోర్టులే లేకుండా చేసి, ప్రతి తప్పిదానికి కోర్టుకే వెళ్లాలని లిఖితపూర్వకంగా రాసిస్తుంటే ఉన్నతాధికారులు, రెవెన్యూలో సుదీర్ఘ అనుభవం ఉందంటూ చెప్పుకునే ఐఏఎస్ అధికారులు సైలెంట్ గా ఉన్నారు.

కేంద్రం ఏం చెప్తుంది?

అన్ని రాష్ట్రాలు స్వమిత్వ, భూదార్ వంటి అంశాలకు ప్రాధాన్యాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. భూ వివాదాలను పరిష్కరించేందుకు భూదార్ వంటి విధానాలు అమలు చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది? భూమి లేకుండానే రికార్డుల్లో ఉంటున్న వారికే సమస్య. హక్కుదారుడికి రికార్డుల ప్రకారం ఎంత భూమి ఉందో, అంతటికి అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన వివరాలు నమోదు చేస్తూ భూదార్ ఇవ్వడం భావితరాలకు మేలు కలుగుతుంది. అసలు భూదార్ అనే పదం ఎందుకు? అని ప్రశ్నించే వారు కేంద్రం అమలు చేస్తున్న చట్టాలను కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతి ప్లాట్ సేల్ డీడ్ లో ఆ విస్తీర్ణానికి సంబంధించిన స్కెచ్/మ్యాప్ అప్లోడ్ చేస్తున్నారు. వ్యవసాయ భూములకు కూడా అది అమలు చేయడం ద్వారా ఇబ్బందులు తలెత్తుతాయంటూ ప్రభుత్వానికి సూచనలు చేస్తుండడం విచిత్రంగా ఉంది.

Advertisement

Next Story

Most Viewed