హైదరాబాద్‌‌పై కాంగ్రెస్ ఫోకస్.. కొత్త అధ్యక్షుడిపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Mahesh |
హైదరాబాద్‌‌పై కాంగ్రెస్ ఫోకస్.. కొత్త అధ్యక్షుడిపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై సొంత పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు మరింత దృష్టి పెడతామని పీసీసీ చీఫ్​మహేష్​ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్​ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీసీసీని త్వరలోనే ప్రక్షాళన చేయబోతున్నామన్నారు. అధికారంలో ఉండటం వలన పదవుల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉన్నదన్నారు. కానీ నేతల నుంచి కాంపిటేషన్ భారీగా ఉంటుందన్నారు. అన్ని జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తామన్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సమర్థవంతంగా పనిచేసే వ్యక్తిని మాత్రమే ఎంపిక చేస్తామన్నారు. పార్టీ ను మరింత బలోపేతం చేసే ఆలోచన కలిగిన వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేస్తామన్నారు. పీసీసీ కార్యవర్గంలోనూ నిజాయితీగా పనిచేసే లీడర్లకే స్థానం లభిస్తుందన్నారు. అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పిస్తామన్నారు. ఇక ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ కు వచ్చిన ఎమ్మెల్యేలకు, ఇప్పటికే ఇన్ చార్జ్ హోదాలో ఉన్న లీడర్ కు సమన్వయం చేస్తామన్నారు. వాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు రాకుండా పీసీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. లీడర్ తో పాటు కేడర్ నూ సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

జిల్లాల పర్యటన..

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు పీసీసీ చీఫ్​తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమం ఉంటుందని, షెడ్యూల్ తయారు చేస్తున్నామన్నారు. పార్టీ అధికారంలోకి రావడం, తనను పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడంలో కార్యకర్తలు, లీడర్ల కృషి ఎంతో ఉన్నదని, ముప్పై ఏళ్లకు పైగా అన్ని జిల్లాల్లోని కార్యకర్తలు తనకు సహకరించారని స్పష్టం చేశారు. భవిష్యత్ లోనూ కార్యకర్తకు ఎలాంటి కష్టాలు రాకుండా చర్యలు తీసుకునేందుకు తాను ముందుంటానని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కార్యకర్తల సంక్షేమం, సమస్యలు పరిష్కారానికి గాంధీ భవన్‌లో మంత్రుల ముఖాముఖీ కార్యక్రమం ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని మార్పులు తీసుకు వస్తానని పీసీసీ చీఫ్​వెల్లడించారు. ముంత్రుల ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని, స్వయంగా ఏఐసీసీ చీఫ్​మల్లికార్జున ఖర్గే ప్రశంసించారని వివరించారు.

హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతుంది..

మూసీ సుందరీకరణతో హైదరాబాద్ కు మరింత ఖ్యాతి వస్తుందన్నారు. పరివాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూమ్‌లు అందజేస్తామన్నారు. ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను కూడా చూపిస్తామన్నారు. హైడ్రాను అనవసరంగా రాజకీయం చేయొద్దని రిక్వెస్ట్ చేశారు. హైడ్రా బాధితులను చూసి హరీష్​రావు కన్నీరు పెట్టడం సరికాదని, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఏం జరిగిందో? అంతా తెలుసునని చురకలు అంటించారు. అప్పుడు బాధితులను పరామర్శించేందుకు కూడా ప్రతిపక్షాన్ని అనుమతించ లేదన్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అడ్డుకున్నారన్నారు.

బీసీలకు న్యాయం చేస్తాం..

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీసీలకు సీట్లను కేటాయించలేక పోయామని, రాజకీయ, సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పార్టీని పవర్ లోకి తీసుకువచ్చేందుకు గెలుపు లక్ష్యంగా సీట్లను ఎంపిక చేశామన్నారు. ఈ సారి స్థానిక సంస్థల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వబోతున్నామన్నారు. బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తామన్నారు. గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు.

Advertisement

Next Story

Most Viewed