ఆరు గ్యారెంటీల అమలు లేదు కానీ.. కొత్తగా 5 లిక్కర్ బ్రాండ్స్: NV సుభాష్ ఫైర్

by Satheesh |
ఆరు గ్యారెంటీల అమలు లేదు కానీ.. కొత్తగా 5 లిక్కర్ బ్రాండ్స్: NV సుభాష్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలేదని, కానీ కొత్తగా ఐదు రకాల లిక్కర్లను పరిచయం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఘాటు విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండాకాలంలో కొత్త బీర్లను తెలంగాణవాసులకు పరిచయం చేసిందని విమర్శలు చేశారు. డిస్టిలర్స్‌ను పెంచే క్రమంలో కొత్త మద్యం నియమ నిబంధనలను అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా ఇప్పుడు కొత్తగా వచ్చిన బీర్లకు సంబంధించిన డిస్టిలర్‌గా దిగ్విజయ్ సింగ్‌ పేరు వినిపిస్తోందన్నారు. పాఠశాలలు మొదలయ్యే క్రమంలో కొత్త మద్యం బ్రాండ్లు పుట్టుకు రావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ కొత్త బ్రాండ్లపై మధ్యప్రదేశ్‌లోనే వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, దీనివల్ల కొత్త వ్యాధులు వస్తున్నాయని ఆ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోందన్నారు. తెలంగాణలో లిక్కర్‌పై ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీపై చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లిక్కర్‌పై ఎనలేని ప్రేమ చూపిస్తోందని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్‌కు దశాబ్ది ఉత్సవాలపై విపరీతమైన ప్రేమ కలిగిందని, ఈ ఉత్సవాలకు సోనియాను పిలుస్తున్నారని, అయితే ఆమెను ఏ హోదాలో ఆహ్వానిస్తున్నారనేది చెప్పాలన్నారు. అమలుకాని హామీలు ఇస్తున్నట్లే సోనియాగాంధీని కూడా ఆహ్వానిస్తున్నారని సుభాష్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కలలు కంటున్నారన్నారు. ఆదాయం పెంచుకునేందుకు లిక్కర్‌తో పాటు స్టాంప్ పేపర్ల రేట్లు కూడా పెంచుతున్నారన్నారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ చాలా దారుణమైన అంశంగా పేర్కొన్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదేదో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కదారి పట్టేలా ప్రవర్తించారని చురకలంటించారు. అన్ని వర్గాలకు చెందినవారి ఫోన్లను నిఘా పెట్టి ట్యాప్ చేయించారని ఆయన విమర్శించారు. కర్నాటకలో ఫోన్ ట్యాపింగ్ జరిగితే అక్కడ సీబీఐ ఎంక్వైరీ వేశారని, కాళేశ్వరం అక్రమాలు బయటపడాలంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని కాంగ్రెస్ అడిగి.. ఇప్పుడు తమకు సీబీఐపై నమ్మకం లేదని చెప్పడం దేనికి నిదర్శనమని పోరెడ్డి కిశోర్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed