కాంగ్రెస్‌లో ‘నామినేటెడ్’ సందడి.. 54 పోస్టుల భర్తీకి కసరత్తు స్టార్ట్

by Rajesh |
కాంగ్రెస్‌లో ‘నామినేటెడ్’ సందడి.. 54 పోస్టుల భర్తీకి కసరత్తు స్టార్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇన్ని రోజులూ ఎంపీ ఎలక్షన్లపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నది. ఏ కార్పొరేషన్ పదవి ఏ లీడర్‌కు ఇవ్వాలనే దానిపై సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు లిస్టు రెడీ చేస్తున్నట్టు సమాచారం. గతంలో ప్రకటించిన 37 పోస్టులకు అదనంగా మరో 17 కార్పొరేషన్ చైర్మన్‌లను కలిపి ఒకేసారి 54 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు ఆఫీసర్లు వర్క్​అవుట్ స్టార్ట్ చేసినట్టు తెలిసింది.

పాత లిస్టులో చేంజెస్

పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రభుత్వం 37 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించింది. అయితే ఆ లిస్టుపై కొందరు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి పదవులు ఇవ్వడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు గిట్టని వారికి కీలక పోస్టులు ఇచ్చి, తమ సన్నిహితులకు అప్రధాన్యత పోస్టులు ఇచ్చారని మరి కొందరు మినిస్టర్లు సీఎం వద్ద వాపోయారు. దీంతో ఆ లిస్టును పెండింగ్‌లో పెట్టాలని సీఎం రేవంత్ ఆఫీసర్లను ఆదేశించడంతో ఆ వివాదానికి పుల్ స్టాప్ పడింది.

కోడ్ ముగియడంతో..

ఎన్నికల కోడ్ ముగియడంతో నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం మళ్లీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తున్నది. పాత లిస్టులో మార్పులు, చేర్పులు చేయడంతో పాటు అదనంగా మరో 17 కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటిస్తే ఎక్కువ మందికి న్యాయం చేయొచ్చనే అభిప్రాయంలో సీఎం ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

సీఎం, మంత్రుల చుట్టూ లీడర్ల ప్రదక్షిణలు

నామినేటెడ్ పోస్టులు ఇప్పించాలని కోరుతూ పలువురు ఆశావహులు సీఎంతో పాటు మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా సీఎం ఇంటి వద్దే ఉంటుండడంతో ద్వితీయ శ్రేణి లీడర్లు ఆయన్ను కలిసి తమకు పదవులు ఇవ్వాలని బయోడేటాతో పాటు జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లెటర్లు అందజేస్తున్నారు. అయితే కొందరు మంత్రులు తమ శాఖ పరిధిలోని కార్పొరేషన్ పదవులను తమ అనుచరులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, అలా కండీషన్లు పెడితే ఇబ్బందులు వస్తాయని ఆయన సూచించినట్టు తెలుస్తున్నది.

జిల్లా స్థాయి పోస్టుల భర్తీపైనా ఫోకస్

లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందుగానే జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగా ఏఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలు సైతం సేకరిస్తున్నట్టు సమాచారం. ప్రతి జిల్లాలో దేవాలయ, మార్కెట్ కమిటీ పోస్టుల కోసం నేతలు పోటీ పడుతుంటారు. ఏ పోస్టు ఎవరికి ఇవ్వాలనే అంశంపై ఆ జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేల సిఫారసులకు ప్రయారిటీ ఇవ్వాలని ఆఫీసర్లకు సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లా స్థాయి పదవులు ఫిలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

Advertisement

Next Story