- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: ప్రభుత్వ కార్యాలయాలే వారి లక్ష్యం.. ప్రశ్నిస్తే కత్తితో బెదిరింపులు..?
దిశ, హైదరాబాద్ బ్యూరో: నాంపల్లి గృహకల్ప ఆవరణలోని ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కరువైంది. కార్యాలయాల పనివేళలు ముగిసిన అనంతరం చీకటి మాటున దొంగలు ఏది దొరికితే దాంతో ఉడాయిస్తున్నారు. గృహకల్ప ఆవరణలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), హౌజింగ్ బోర్డు, పీఏఓ కార్యాలయాలతో పాటు ఎస్‌బీఐ బ్యాంక్, టీజీఓ, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా, తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, గ్రంథాలయం ఉన్నాయి. వీటిల్లో రాత్రిపూట సెక్యూరిటీ లేకపోవడంతో చిల్లర దొంగలు రెచ్చిపోతున్నారు. చేతికి దొరికినదాంతో పరారౌతున్నారు. గత కొంతకాలంగా ఇలా దొంగతనాలు జరుగుతున్నా వీటిపై పోలీసులకు ఫిర్యాదులు అందకపోవడం వీరికి కలిసివస్తోంది.
రెండు రోజుల క్రితం ఏసీ కాపర్ కేబుల్ దొంగతనం..
రెండు రోజుల క్రితం హెచ్ఆర్సీ పనివేళలు ముగిసిన అనంతరం రాత్రి సమయంలో దొంగలు ఏసీ కాపర్ పైపులను దొంగిలించుకుపోయారు. ఇదే భవనం 2వ అంతస్తులో ఉన్న పీఏఓ కార్యాలయానికి చెందిన ఏసీ కాపర్ పైపులను కూడా కత్తిరించుకుపోయారు. అయితే పీఏఓ అధికారులు అబిడ్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. హెచ్ఆర్సీలో దొంగతనంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది.
సెక్యూరిటీ లోపం..
గృహకల్ప ఆవరణలో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అయితే వీటి వద్ద రాత్రి పూట సెక్యూరిటీ లేకపోవడాన్ని దొంగలు పసిగట్టి హస్తలాగవం చూపిస్తున్నారు. వాస్తవానికి హెచ్ఆర్సీలో రాత్రి సమయంలో సెక్యూరిటీ బాధ్యతలు నిర్వహించేందుకు ఇద్దరు సిబ్బంది ఉన్నప్పటికీ వారితో ఉదయం పూట కార్యాలయంలో అటెండర్ పనులు చేయిస్తున్నట్లు తెలిసింది. దీంతో రాత్రి సమయంలో కాపలా లేకుండా పోతోంది. దీని ఎదురుగా ఎస్బీఐ బ్యాంక్ ఉన్నా ఇక్కడ కూడా రాత్రి వేళల్లో భద్రతా సిబ్బంది ఉన్న దాఖలాలు లేవు. ఇవే కాకుండా పలు ఉద్యోగ సంఘాల కార్యాలయాలు, బ్యాంక్ ఏటీఎం ఉన్నాయి. వీటన్నింటికీ రాత్రి 8 దాటిందంటే తాళాలు పడతాయి. ప్రధాన గేటు వద్ద సెక్యూరిటీ ఉన్నప్పటికీ దొంగలు వారి కండ్లుకప్పి లోనికి ప్రవేశిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు.
కత్తితో బెదిరింపులు..?
ఇటీవల గృహకల్ప ఆవరణలో కార్యాలయాల పనివేళలు ముగిసిన అనంతరం అనుమానాస్పదంగా తిరుగుతున్న దొంగను ఓ ఉద్యోగి ఆపి మీకు ఏం కావాలని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో సదరు దొంగ కత్తి చూపించి బెదిరించినట్లు సమాచారం. సంఘటనతో భయపడిపోయిన ఉద్యోగి ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండగా ఏసీ కాపర్ కేబుల్స్ చోరీకి గురికావడంతో ఈ విషయం బయటకు పొక్కి చర్చనీయాంశమైంది. చివరకు పోలీసుల వరకు కూడా సమాచారం చేరడంతో వారు విచారణ చేపడుతున్నారు. పోలీసులు తగిన భద్రతా చర్యలు చేపట్టాలని, కార్యాలయాలు, బ్యాంక్‌ల వద్ద తగిన సెక్యూరిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు అందరి నుంచి వ్యక్తం అవుతున్నాయి.