వర్షాలు తగ్గే వరకు వైద్యారోగ్యశాఖకు నో హాలిడేస్

by Mahesh |
వర్షాలు తగ్గే వరకు వైద్యారోగ్యశాఖకు నో హాలిడేస్
X

దిశ; తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. వర్షాలు తగ్గే వరకు వైద్యారోగ్యశాఖ డాక్టర్లు, ఇతర స్టాఫ్​కు సెలవులు ఇవ్వొద్దని డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, డీహెచ్ లను ఆదేశించారు. శనివారం ఆయన ఆరోగ్య శ్రీ ఆఫీస్ లో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డాక్టర్లు, స్టాఫ్ అందరూ హెడ్‌ క్వార్టర్స్‌‌లోనే ఉండాలని, ప్రతి ఒక్కరూ డ్యూటీలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్‌(ఈడీడీ) దగ్గరగా ఉన్న గర్భిణులను ముందే హాస్పిటళ్లకు తరలించి, వెయిటింగ్ రూమ్స్‌ కేటాయించాలని ఆదేశించారు. గర్భిణీ, ఆమెతో వచ్చిన కుటుంబ సభ్యులకు భోజన వసతి కల్పించాలన్నారు. అన్ని ఏరియాల్లో అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రత్యేకంగా మెడిసిన్, టెస్టింగ్ కిట్లు స్టాక్ పెట్టుకోవాలన్నారు. పేషెంట్లకు అందించే ఆహారం, తాగునీరు విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

వర్షాలు తగ్గిన తర్వాత కూడా దోమల బెడద ఎక్కువగా ఉంటుందని, ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన జ్వరాలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని మంత్రి హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ ను రెడీ చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, దోమల నియంత్రణకు పంచాయతీరాజ్‌, మునిసిపల్ శాఖ సహకారం తీసుకోవాలన్నారు. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల హాస్టళ్లలో స్టూడెంట్స్‌కు అందజేసే ఫుడ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గురుకులాల్లో పిల్లలకు అందించే భోజనం విషయంలోనూ జాగ్రత్తలు పాటించేలా ఆయా శాఖల అధికారులకు మంత్రి సూచించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం డెంగీ పాజిటివ్ రేట్ 7 శాతం నుంచి 6 శాతానికి తగ్గినట్లు మంత్రి వెల్లడించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఉన్నతాధికారులంతా ఫీల్డ్ విజిట్ కు వెళ్తున్నారని, తనకు ఎప్పటికప్పుడు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. వ్యాధుల నియంత్రణకు వైద్యాధికారులంతా సమన్వయంతో వర్క్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story